T Congress Assembly Ticket Application To Begin On August 18th : త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ దరఖాస్తులుఆహ్వానించింది. ఈ ప్రక్రియలో ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు అర్జీలు తీసుకుంటారు. ఇప్పటికే ధరఖాస్తు విధివిధానాలను సబ్ కమిటీ ఖరారు చేసింది. దరఖాస్తుల స్వీకరణ రుసుము విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ధరఖాస్తు చేసుకోవడానికి రూ.25 వేలు, ఓసీలకు రూ.50 వేలు చొప్పున ధరఖాస్తు రుసుము ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Telangana Congress MLA Ticket Applications :ఆశావహుల కోసం నాలుగు పేజీల ధరఖాస్తును గాంధీభవన్లో అందుబాటులో ఉంచారు. వ్యక్తిగత వివరాలతో పాటు, ప్రస్తుత పార్టీలో హోదా, గతంలో పార్టీకి చేసిన సేవ, ఇప్పటి వరకు పొందిన పదవులు, గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, ఎన్నికల్లో గెలుపు ఓటములు, గతంలో ఇతర పార్టీలలో పనిచేసిన అనుభవం, సామజిక మీడియా యాక్టీవిటి, క్రిమినల్ కేసులు, కోర్ట్ శిక్షలతో పాటు పోటీ చేయదలచిన సెగ్మెంట్ తదితర అంశాలను ధరఖాస్తులో పొందుపరచాల్సి ఉంటుంది. అదేవిధంగా గెలిచినా.. ఓడినా పార్టీలోనే ఉంటానంటూ అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
T Congress Assembly Elections 2023 : అర్జీలను తీసుకోడానికి గాంధీభవన్(Gandhi Bhavan) లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ధరఖాస్తులు స్వీకరణ ముగిసిన తర్వాతకాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ స్క్రూటీని చేస్తుంది. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాను రూపొందించి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కమిటీకి నివేదిస్తారు. ఈ జాబితాను స్క్రీనింగ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే అభ్యర్థులతో నేరుగా మాట్లాడతారు. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, అభ్యర్థి పోటీ చేయదలిచిన సెగ్మెంట్లోని ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు బేరీజు వేసుకుని పార్టీ అధికంగా ఉన్న నియోజకవర్గాల నుంచి మూడేసి పేర్లు సెంట్రల్ ఎన్నికల కమిటీ సిఫారసు చేస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందుకు వచ్చిన స్క్రీనింగ్ కమిటీ నివేదికను మరోసారి పరిశీలించి చివరకు సీడబ్ల్యూసీ ఆమోదంతో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.