T Congress Assembly Elections 2023 Plan :రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌పై ప్రజా వ్యతిరేఖ విధానాలను గడప గడపకూ తీసుకెళ్లాలని నిర్ణయించిన పీసీసీ.. అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి సారించింది. ఏఐసీసీ ముఖ్య నేతల పర్యటనలు, వరుస సమావేశాలు, చేరికలతో ఇటీవల పార్టీలో జోష్ వచ్చింది. తిరగబడదాం-తరిమికొడదాం అన్న నినాదంతో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిన పార్టీ.. తాజాగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసీసీ కమిటీలు ఏర్పాటు చేసిన తరువాత మొట్టమొదటిసారి ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు రెండూ కలిసి కట్టుగా గాంధీభవన్‌లో సమావేశమయ్యాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీఈసీ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు జిఘ్నేష్ మేవాని, బాబా సిద్దిఖీలు పాల్గొన్నారు. ముఖ్య నాయకులంతా పాల్గొన్న ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌తో పాటు ఇద్దరి సభ్యులను సమావేశానికి హాజరైన నేతలకు పరిచయం చేశారు.
T Congress Plans Like Karnataka on Five Guarantees : అనంతరం అభ్యర్థుల ఎంపిక గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉండాలి, కర్ణాటకలో అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది, ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలితదితర అంశాలపై సీనియర్ల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ), స్క్రీనింగ్ కమిటీలు నిర్ణయించాయి. దరఖాస్తుల స్వీకరణకు రుసుం ఎంత అన్నదానిపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ఛైర్మన్‌గా ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్‌లు సభ్యులుగా సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ నెల 17వ తేదీ ఉదయానికి రుసుములు, ఇతర అంశాలపై పీసీసీకి నివేదిక ఇస్తుంది. మరుసటి రోజు అంటే 18వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. 25వ తేదీ వరకు అర్జీలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు.
వీలైనంత త్వరగా అభ్యర్థుల ప్రకటన..: అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరగడం వల్ల గత ఎన్నికల్లో ఇబ్బందులు ఏర్పడినట్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈసారి ఆలా జరగకుండా వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించాలని కొందరు సీనియర్లు చేసిన ప్రతిపాదనపై సమావేశం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని నిర్ణయించింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మైనారిటీలకు పాత బస్తీకే పరిమితం చెయ్యకుండా ముస్లిం జనాభా అధికంగా సీట్లు కేటాయించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కర్ణాటకలో పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్‌లు సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం. అదేవిధంగా జనరల్ స్థానాల్లో కూడా సామాజిక న్యాయం పాటించాలన్న అభిప్రాయం కూడా సమావేశంలో కొందరు నాయకులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గానికి ముగ్గురి ఎంపిక: సెప్టెంబర్ మొదటి వారంలో మరోసారి ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నిర్దేశించిన రుసుం చెల్లించి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా అర్జీలు ఇచ్చుకోవచ్చని సమావేశం నిర్ణయించిందన్నారు. 25వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి నియోజకవర్గాల వారీగా వేరు చేసి వచ్చే నెల మొదటి వారంలో జరగనున్న పీఈసీ సమావేశంలో ఉంచుతారు. వాటిని పరిశీలించి నియోజకవర్గానికి మూడు పేర్లను ఎంపిక చేస్తుంది. సర్వేలతోపాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేయనున్నట్లు మహేష్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.