Symptoms to detect cancer: రకరకాల క్యాన్సర్ల గురించి చాలామందికి అవగాహన ఉండటం సహజమే. అయితే కళ్లకు కూడా క్యాన్సర్ సోకుతుందనేది చాలా తక్కువ మందికే తెలుసు. ప్రభుత్వ కంటి ఆసుపత్రి అయిన సరోజనిదేవితో పాటు ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యశాలకు తరచూ ఇలాంటి కేసులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎల్వీ ప్రసాద్‌లో ఇప్పటివరకు 25 వేల కేసులకు చికిత్స అందించారు. శనివారం ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఏ వయసు వారైనా:కంటి క్యాన్సర్ నేత్రాల చుట్టూ ఉన్న కణజాలం, కనురెప్పలు, కళ్లను రక్షించే పల్చటి పొర (కంజంక్టివా)ల్లో వచ్చే అవకాశం ఉంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువుల నుంచి పెద్ద వాళ్ల వరకు ముప్పు ఉంది. మొదటి దశలోనే గుర్తించి చికిత్స అందించకపోతే కంటి చూపే కాకుండా ప్రాణాల మీదకు వస్తుందని చెబుతున్నారు. కంటి చుట్టూ, లోపల కణుతులు ఉంటే.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కంటి క్యాన్సర్‌కు సరైన కారణాలు లేనప్పటికీ.. ధూమపానం, వైరస్ ఇన్ఫెక్షన్లు, అల్ట్రా వయలెట్ కాంతికి ఎక్కువ సార్లు బహిర్గతం కావడం వల్ల సోకవచ్చంటున్నారు.