చరిత్రకు సంబంధించి తెలంగాణ ఒక పుష్పక విమానం లాంటిదని భాషా, సాంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో సింఫనీ ఇన్ స్టోన్ పేరిట ప్రముఖ ఔత్సాహిక యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య ఏర్పాటు చేసిన జాతీయ ఛాయా చిత్ర ప్రదర్శనను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఐదు రోజులపాటు జరగనున్న ఈ ప్రదర్శనలో రాష్ట్ర చారిత్రక, పురావస్తు, ఆధ్యాత్మిక విషయాలు ప్రతిబింబించే రీతిలో కొలువుదీరిన ఛాయా చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సింఫనీ ఇన్ స్టోన్ కాకతీయుల శిల్ప కళా వైభవం, ఆనాటి దేవాలయాలు, చరిత్ర, వాస్తు, మెట్ల బావులు వంటి అంశాలను కళ్లకు కట్టినట్లు ఛాయా చిత్రాలు అబ్బుర పరుస్తున్నాయి. కాకతీయుల కాలం నాటి విశేషాలు, ఎన్నో చారిత్రక ఘట్టాలు సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి రామప్ప దేవాలయం విశిష్టతలు, శైవ, వైష్ణవ సంప్రదాయలు, శివకేశవత్వం, ఏకత్వ భావనలు, ఇతర విశేషాలను చాటిచెప్పే ప్రయత్నం చేసిన అరవింద్ కృషిని చరిత్రకారులు అభినందించారు. ఇంకా ఎన్నో కొత్త అంశాలు ఎన్నో వెలుగులోకి రావాల్సిన గొప్పదనం తెలంగాణ చరిత్ర, మట్టి పొరల్లో దాగి ఉందని హరికృష్ణ వెల్లడించారు.
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సింఫనీ ఇన్ స్టోన్ జాతీయ ఛాయా చిత్ర ప్రదర్శన తెలంగాణ చరిత్రకు తలమానికంగా నిలిచేది కాకతీయుల కాలమైతే... అప్పటి శిల్ప సంపద, దేవాలయాలు, చెరువులు, పట్టణ ప్రణాళికలు ప్రపంచంలో ప్రామాణికంగా చెప్పుకొదగ్గ శిల్ప సంపదకు నెలవుగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ చరిత్ర, సాహిత్యానికి సంబంధించి ఛాయా చిత్ర ప్రదర్శనలు, పుస్తకాలు ప్రచురించడంతోపాటు.. కళలు, సంస్కృతి లాంటి విశేషాలను డాక్యుమెంట్ చేసి ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించేందుకు కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. చరిత్రకారులు, ఇంజనీర్లకు నిత్యపఠనీయం, పరిశోధన వస్తువుగా ఈ ఎగ్జిబిషన్ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'రామప్ప శిల్పా సౌందర్యం చాలా గొప్ప నిర్మాణం. ఈ ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా అప్పటి సంస్కృతి, విశేషాలు తెలుస్తాయి. కాకతీయుల కాలానికి విశేషమైన చరిత్ర ఉంది. అప్పటి కాలం నాటి శిల్ప నిర్మాణం చరిత్రను ప్రతిబింబిస్తాయి. కొత్త విషయాలు, చరిత్ర ఆనవాళ్లను మనం తెలుసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ తోడ్పడుతుంది. అరవింద్ ఆర్య ఏర్పాటు చేసిన జాతీయ ఛాయా చిత్ర ప్రదర్శన ద్వారా కళలు, సంస్కృతిపై ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం.' - మామిడి హరికృష్ణ, డైరెక్టర్, తెలంగాణ భాషా, సాంస్కృతి శాఖ