గ్రూప్-2 పరీక్షకు ఇలా ప్రిపేర్ అవ్వండి..! - TS group 2 exam syllabus
Tips to crack Group 2 exam: గ్రూప్-1 తర్వాత ఉద్యోగార్థులు ఎక్కువగా ఎదురుచూసే నోటిఫికేషన్ గ్రూప్-2. తాజాగా 783 ఉద్యోగాలతో గ్రూప్- 2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. జనవరి 18 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలవుతోంది. భారీగా పోటీ ఉండే ఈ నియామక పరీక్షకు సమగ్రంగా ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకుందాం!
గ్రూప్ 2 పరీక్షకు ప్రణాళిక
By
Published : Jan 3, 2023, 2:08 PM IST
Tips to crack Group 2 exam: నిరుద్యోగుల్లో ఎక్కువమంది గ్రూప్-2 ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఫలితంగా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణాలు.
ఆబ్జెక్టివ్ పరీక్ష విధానం.
రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో మధ్యస్థాయి పరిపాలనా ఉద్యోగాల్లోకి ప్రవేశించే అవకాశం.
గ్రూప్ 1, సమాన హోదా కలిగిన ఉద్యోగాల్లోకి పదోన్నతి పొందే అవకాశం.
కార్యనిర్వహణాధికారం ఉన్న ఉద్యోగాలు అవ్వటం వల్ల సామాజిక గుర్తింపు ఎక్కువగా ఉండటం.
తాజాగా ప్రకటించిన గ్రూప్-2 సర్వీసుల్లో మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తాసిల్దార్, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి 18 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో గ్రూప్-2 నియామకానికి ఉద్దేశించిన పరీక్ష నమూనానే ఈ నోటిఫికేష న్‌లో కూడా అనుసరిస్తున్నారు.
నాలుగు పేపర్లు: గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కీ 150 చొప్పున మొత్తం 600 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.
సీనియర్ అభ్యర్థులు:గత కొన్ని సంవత్సరాలుగా కేవలం గ్రూప్ 2 పరీక్షనే నమ్ముకుని ఎలాగైనా గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలని తదేక దీక్షతోఎదురుచూస్తున్న అభ్యర్థులు పేపర్ 3లో వచ్చిన సిలబస్ మార్పుల్ని గమనించాలి. గత సిలబస్ అంశాలు కొనసాగిస్తూనే జోడించిన అంశాలపై దృష్టిపెట్టాలి.
జనాభా సంబంధిత అంశాలకు భారతదేశం తెలంగాణ కోణంలో ప్రాధాన్యం
భారతదేశ వ్యవసాయం, పారిశ్రామిక వ్యవస్థలు
భారతదేశ విత్తవ్యవస్థ
భారతదేశ వాణిజ్యం
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక సర్వే, బడ్జెట్‌లు
పర్యావరణ విధానాలు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం మొదలైన అదనపు అంశాలు జోడించారు.
గత సిలబస్‌లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థలోని కొన్ని అంశాలను వృద్ధి, అభివృద్ధి అనే విభాగంలో చేర్చారు.
ఈ మార్పుల్ని గమనించి సీనియర్ అభ్యర్థులు కూడా సన్నద్ధం కావడం అవసరం. ఈ స్వల్పకాలంలో వాటిపైన కూడా పట్టు సాధిస్తే సంపూర్ణంగా పరీక్షకు సిద్ధపడినట్లే.
ఏవైనా కారణాలవల్ల సన్నద్ధతలో అంతరాయం ఏర్పడి ఉంటే ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా మళ్లీ సబ్జెక్టుపైన పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. గత సంవత్సర కాలంలో ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, రాజ్యాంగ అంశాల్లో వచ్చిన మార్పుల్ని గమనించుకుంటూ కరెంట్ అఫైర్స్‌తో అనుసంధానం చేసుకొని సబ్జెక్టును అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్న పుస్తకాలను మాత్రమే చదివి ఊరుకోకుండా తాజాగా వచ్చిన విషయ అంశాలనూ జోడించుకుని చదవాల్సి ఉంటుంది.
బిట్ల, టెస్టుల సాధన ముఖ్యం: ఆబ్జెక్టివ్ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, అధ్యయనం చేయటమే కాదు- ఏ విధంగా బిట్లు వస్తాయి అనేది ఊహించాలి. వాటిని సాధన చేయాలి. టాపిక్, చాప్టర్లు, సబ్జెక్టుల వారీగా ఆ ప్రాక్టీస్ ఉండాలి. అప్పుడే పరీక్ష హాల్లో ఎటువంటి సందిగ్ధతలకూ గురి కాకుండా విజయవంతంగా లక్ష్యాన్ని సాధించవచ్చు. అందువల్ల అనునిత్యం వివిధ అంశాలను చదవగానే బిట్ల లాగా ప్రాక్టీస్ చేసే విధానాన్ని కొనసాగించాలి. అలా అని బిట్లు మాత్రమే చదివితే ఉపయోగం ఉండదు.
గ్రూప్-1 ప్రిలిమినరీ ఓ నమూనా: టీఎస్‌పీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష మూసకు భిన్నంగా వైవిధ్యంగా ఉంది. దీనిలో విభిన్న రూపాల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు కనిపించాయి. కొన్ని ప్రశ్నలు చదవటానికి ఎక్కువ సమయం పట్టింది. జతపరిచే ప్రశ్నలు, అసర్షన్- రీజన్ ప్రశ్నలు, మౌలిక అంశాల ప్రశ్నలు అభ్యర్థులను చాలా ఇబ్బంది పెట్టాయి. సంపూర్ణంగా, సమగ్రంగా సిలబస్ అంశాలను అధ్యయనం చేసినవారు మాత్రమే విజయం సాధించే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల గత గ్రూప్-2 పరీక్ష ప్రశ్నపత్రాలను చూడటం మంచిదే కానీ అదే రూపంలో ప్రశ్నలు వస్తాయని మాత్రం ఆశించవద్దు. ‘గ్రూప్-1 ప్రిలిమినరీ తరహా ప్రశ్నలు వస్తే ఏం చేయాలి?’ అనే ప్రణాళిక పకడ్బందీగా రచించుకోవాలి. అందుకు అనుగుణమైన సన్నద్ధతను ఆచరించాలి.
ప్రభుత్వ ప్రచురణలకు ప్రాధాన్యం: సిలబస్‌లో ఉన్న వివిధ పాఠ్యాంశాలకు అనుగుణంగా పాఠశాల పుస్తకాలు, విశ్వవిద్యాలయాల పుస్తకాలు, ప్రభుత్వ వెబ్‌సైట్లను ప్రధాన వనరులుగా పరిగణించాలి. అయితే ఆయా పుస్తకాల్లో వర్తమాన అంశాలను జోడించారా లేదా అనేది కూడా చూసుకోవాలి. కొన్ని ప్రైవేటు ప్రచురణలు ఆ లోటును తీరుస్తున్నాయి కాబట్టి వాటిపై దృష్టిని నిలపడం సముచితమే.
సమయం సరిపోతుందా?:నోటిఫికేషన్‌లో పరీక్ష నిర్వహించే తేదీని స్పష్టంగా పేర్కొనలేదు. అయితే ‘పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన సమయం ఇస్తా’మని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ చెప్పటం అభ్యర్థులకు కొంత ఊరటే. ‘ఇతర పరీక్షల తేదీలకు ఆటంకం లేకుండా చూస్తా’మని కూడా ఆయన తెలిపారు. కాబట్టి తాజాగా ఈ ఉద్యోగాలకు సన్నద్ధం అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు సరైన ప్రణాళికతో ముందుకెళ్తే సకాలంలో సిలబస్ పూర్తి చేసుకోవచ్చు. పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించి ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి.
నిర్దిష్ట ప్రణాళికతో రోజుకి 12 నుంచి 16 గంటలు అధ్యయనం చేయగలిగితే విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయి. పరీక్ష, సిలబస్, ప్రశ్న రూపాలపై సరైన అవగాహన ఏర్పరుచుకోగలిగితే సన్నద్ధత సులభం అవుతుంది. అంతే కాదు, కచ్చితంగా పరీక్షకు ఏం కావాలి అనే ధోరణితో ప్రిపరేషన్ కొనసాగి ఉద్యోగ సాధన మార్గం సుగమం అవుతుంది.