మునుగోడు ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాజకీయ పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ మరింత పదునెక్కింది. తెరాస మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ భాజపాలో చేరికతో.. గులాబీదళం 'ఘర్ వాపసీ' ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఒకేరోజూ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ తిరిగి సొంతగూటికి చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. నిన్న భిక్షమయ్యగౌడ్ కమలం గూటి నుంచి గులాబీపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే నేత కేసీఆర్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రం కోసం స్వామిగౌడ్ వీరోచిత పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభావశీలమైన నాయకుడు దాసోజు శ్రవణ్ తెరాసలో చేరడం శుభపరిణామమని కేటీఆర్ అన్నారు.
మళ్లీ తెరాస గూటికి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ - తెరాస గూటికి దాసోజు శ్రవణ్
16:44 October 21
మళ్లీ తెరాస గూటికి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే నేత కేసీఆర్ మాత్రమే: తెలంగాణ సాధనకోసం కసితో పోరాటం చేశామని స్వామిగౌడ్ అన్నారు. అందరి పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలు కేంద్రం పరిష్కరించాలన్న ఆయన.. విభజన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతో భాజపాలో చేరానని వ్యాఖ్యానించారు. ఏ ఆశయం కోసం పార్టీలో చేరామో.. అది నెరవేరలేదు.. అందుకే భాజపాలో నుంచి తెరాసలో చేరుతున్నామని స్వామిగౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే నేత కేసీఆర్ మాత్రమేనన్న స్వామిగౌడ్.. కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేయాలని పేర్కొన్నారు.
శ్వాస ఉన్నంతవరకు కేసీఆర్‌కు అండగా ఉంటా: కుటుంబంలో ఒక సభ్యుడిగా పార్టీలోకి ఆహ్వానించారని దాసోజు శ్రవణ్ అన్నారు. దేశానికి తలమానికంగా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. నవ భారత నిర్మాణం కోసం ఉడుతా భక్తిగా తెరాసలో చేరుతున్నానన్నారు. ఆశలు, ఆకాంక్షలతో భాజపాలోకి వెళ్లామన్న ఆయన.. భాజపాలో మూస రాజకీయాలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తన శ్వాస ఉన్నంతవరకు కేసీఆర్‌కు అండగా ఉంటానని అన్నారు.
ఇవీ చదవండి: