Telangana Wins Swachh Sarvekshan Grameen Awards : స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల్లో మరోమారు తెలంగాణలోని పలు జిల్లాలు సత్తా చాటాయి. జూన్ నెలకు నాలుగు కేటగిరీల్లోని మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జిల్లాలను కేంద్ర జలశక్తి శాఖ అవార్డులు ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో నాలుగు తెలంగాణ నుంచే ఉండడం గమనార్హం.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో అచీవర్స్, హై అచీవర్స్ విభాగాల్లో రెండు, మూడు విభాగాల్లో తెలంగాణలోని జిల్లాలు నిలిచాయి. అచీవర్స్ కేటగిరీలో రెండో స్థానంలో హనుమకొండ, మూడో స్థానంలో కుమురం భీం ఆసిఫాబాద్, హై అచీవర్స్ కేటగిరీలో రెండో స్థానంలో జనగాం, మూడో స్థానంలో కామారెడ్డి జిల్లాలు నిలిచాయి. ఈ అవార్డులు రావడం పట్ల పట్టణ, పురపాలక శాఖ పారుశుద్ధ్య కార్మికులను అభినందించింది. సమష్ఠి కృషి వల్లే ఈ అవార్డు వరించిందని పురపాలక శాఖ కమిషనర్ తెలిపారు.
National Panchayat awards 2023 : 2023 సంవత్సరానికిగానూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలంగాణ పల్లెలు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి చేతులు మీదగా పంచాయతీ ప్రతినిధులు ఈ అవార్డులను అందుకున్నారు. కేంద్రం ప్రకటించిన 46 అవార్డుల్లో ఏకంగా 13 అవార్డులు తెలంగాణ పల్లెలకు వచ్చాయి.