హైదరాబాద్ చంపాపేట్ వద్ద సాగర్ రోడ్డుపై సింగరేణి కాలనీవాసులు నిరసనకు దిగారు. దాదాపు 7 గంటలుగా రహదారిపై ధర్నా చేస్తున్నారు. ఆరేళ్ల బాలిక మృతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకున్న నిందితుడు రాజును ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో చంపాపేట్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలికి హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, డీసీపీ రమేశ్‌రెడ్డి చేరుకున్నారు. ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
బాలిక అనుమానాస్పద మృతి.. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని ఆందోళన ఇదీ జరిగింది..
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో నిన్న అదృశ్యమైన చిన్నారి.. పక్క ఇంట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి విగతజీవిగా కనిపించింది. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. స్థానికుల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు.
బాలికపై రాజు అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు. రాజును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చంపాపేట్ రహదారిపై కాలనీవాసులు ధర్నాకు దిగారు. బాలికను హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
సంబంధిత కథనం.. బాలిక అనుమానాస్పద మృతి.. తక్షణ సాయం అందించిన కలెక్టర్