Telangana Budget Session: శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజునే అనూహ్య సంఘటన చోటుచేసుకొంది. శాసన సభలో మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్, రఘునందర్రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్ చేసింది.
భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు భాజపా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సభ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.
అసెంబ్లీ ఆవరణలో ధర్నా
ప్రభుత్వ తీరుపై భాజపా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వతీరును నిరసిస్తూ.. అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. వారికి నచ్చజెప్పేందుకు అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు యత్నిస్తున్నారు. చివరకు ముందుగా రాజాసింగ్, రఘునందన్ రావును మార్షల్స్ బయటకు తరలించారు. ఆ తరువాత ఈటలను కూడా బయటకు తరలించారు.
మార్షల్స్ తమను తరలించిన తీరుపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు అబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డిపై అగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేల హక్కులను హరించే అధికారం పోలీసులకు లేదని మండిపడ్డారు. ఏసీపీ వెంకట్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని భాజపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఇవీచూడండి:Telangana Budget 2022-23 : రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్