శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం..... గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న.... నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రయోజనాల కోసం కృష్ణానదిపై బ్యారేజీ సహా పలు పథకాలు చేపట్టాలని నిర్ణయించింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం త్వరగా సమగ్ర సర్వేను పూర్తి చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
జోగులాంబ బ్యారేజీ
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం.... శ్రీశైలం వెనక భాగంలో.... కృష్ణాలో తుంగభద్ర కలవక ముందు.... నదీ ప్రాంతంలోనే 35 నుంచి 40 టీఎంసీలు... నిల్వ చేసేలా జోగులాంబ బ్యారేజీ నిర్మించ తలపెట్టారు. కృష్ణాలో భీమానది కలిసేచోట... నారాయణపేట జిల్లా కుసుమర్తి వద్ద నుంచి రోజుకు ఒక టీఎంసీ నీటిని మళ్లించేలా భీమా వరద కాలువ రూపొందించారు. సుంకేశుల బ్యారేజి వెనకప్రాంతం నుంచి.... అలంపూర్, గద్వాల సహా ఆర్డీఎస్, నెట్టెంపాడు పథకాల కింద నీరందని ప్రాంతం కలిపి.... 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా ఎత్తిపోతల పథకం ప్రతిపాదించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా కొత్త రిజర్వాయర్లు సహా ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎగువ ప్రాంతంలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం లక్ష్యంగా పులిచింతల ప్రాజెక్టు వెనకభాగం నుంచి ఎత్తిపోతల పథకం చేపట్టనున్నారు. సాగర్ చివరి ఆయకట్టు, గ్యాప్ ఆయకట్టు లక్ష ఎకరాలకు నీరందించేందుకు నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించారు. వీటిపై త్వరగా సర్వే చేసి... సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.