Surgical Instruments Group Holdings Investment in Telangana : పెట్టుబడుల సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సాగింది. రూ.37వేల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్‌లో యూకేకి చెందిన సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్(Surgical Instruments Group Holdings) రూ.231 కోట్లతో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. ఈ మేరకు గురువారం దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ఎండీ గౌరి శ్రీధర, డైరెక్టర్ అమర్ చర్చల అనంతరం ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ మొదటి దశలో సర్జికల్, ఆర్థోపెడిక్, ఆఫ్తమాలిక్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. రెండో దశలో రొబొటిక్ వైద్య పరికరాలను తయారు చేయనుంది.
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ - దావోస్ వేదికగా రూ. 37వేల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు
CM Revanth Reddy Davos Tour Update :సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పేర్కొన్నారు. అన్నదాతలకు కార్పొరేట్ సంస్థల తరహాలో లాభాలు వస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు. రైతులకు కనీస మద్దతు ధరకన్నా ఎక్కువ లాభాలు రావాలన్నది తన స్వప్నమని దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు.
"భారత్‌లో రైతు ఆత్మహత్యలు అతిపెద్ద సమస్య. రైతులకు బ్యాంకు రుణాలు రావు, ఆధునిక టెక్నాలజీ లేదు. సరైన లాభాలు రావడం లేదు. తెలంగాణలో మాది రైతు ప్రభుత్వం. రైతుభరోసా ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నాం. రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలని నా స్వప్నం. లాభాలు వస్తే రైతు ఆత్మహత్యలు 99శాతం ఉండవు."-రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి