హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి (Surabhi Vanidevi) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. వాణీదేవితో ప్రమాణం శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.
నువ్వానేనా? అన్నట్లుగా సాగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానాన్ని అధికార పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి కైవసం చేసుకున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్ధి రామచంద్రరావుపై 20,820 ఓట్లతో ఆమె గెలుపొందారు.
నాపై ఎంతో నమ్మకముంచి నాకు ఓటు వేసిన గ్రాడ్యుయేట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో స్టడీ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను ఎంపిక చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ప్రజలంతా నాకు ఓటు వేశారు. నా జీవితంలో మరచిపోలేని అపురూపమైన ఘట్టం ఇది. రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నాను. కానీ రాజకీయాల్లోనే పుట్టిన వాళ్లం కనుక ప్రజాసేవ అనేది మా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ప్రజాసేవ చేయడానికి అధికారం అవసరంలేదు అనుకునేదాన్ని. కానీ పదవిలో ఉంటే ఇంకా ఎక్కువ మందికి ప్రజాసేవ చేయొచ్చని గ్రహించి నిర్ణయం మార్చుకున్నాను. నా గెలుపునకు దోహదం చేసిన ప్రజాప్రతినిధులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
-- సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన సురభి వాణీదేవి
ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో వాణీదేవికి పట్టం