Supreme Court Recommend Justice Alok Aradhe : తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి కొత్త సీజేగా జస్టిస్ అలోక్ అరధే నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను.. పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసిన కొలీజియం.. ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ పేరును సిఫారసు చేసింది.
జస్టిస్ అలోక్ అరధే ప్రస్థానమిది..: రాయ్‌పూర్‌లో 1964 ఏప్రిల్ 13న జన్మించిన జస్టిస్ అలోక్... 1988 జులై 12న న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2009 డిసెంబర్ 29న నియమితులయ్యారు. జమ్ముకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా 2016 సెప్టెంబరు 16న బదిలీ అయిన జస్టిస్ అలోక్ అరధే... ఆ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీకి, లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఛైర్మన్‌గా చేశారు. జస్టిస్ అలోక్ అరధే 2018లో మూడు నెలల పాటు జమ్ముకశ్మీర్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు. కర్ణాటక హైకోర్టు జడ్జిగా 2018 నవంబరు 17 నుంచి కొనసాగుతున్న జస్టిస్ అలోక్... కొంతకాలం కర్ణాటక తాత్కాలిక సీజేగా చేశారు.
సుప్రీం న్యాయమూర్తులుగా వారికి పదోన్నతి : రాష్ట్ర హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కొలీజియం సిఫార్సు చేసింది. కేరళ హైకోర్టు సీజే జస్టిస్ వెంకట నారాయణ భట్టిని కూడా... సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలిజియం సిఫార్సు చేసింది. వీటికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు పొందనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ కిషన్‌కౌల్, జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలిజియం బుధవారం ఈమేరకు సిఫార్సు చేసింది.