ఆ ఎంపీ ఎన్నికపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలన్న సుప్రీం - సుప్రీం కోర్టులో విచారణ
13:32 September 28
ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలన్న సుప్రీం
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్ ఎన్నికను సవాలు చేస్తూ... దాఖలైన పిటిషన్‌ను పునః పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచిస్తూ... సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ... ప్రత్యర్దిగా పోటీ చేసిన మదన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మదన్‌మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం పొందుపరిచారని.... తనపై ఉన్న క్రిమినల్ కేసులకు సంబందించిన కొన్ని విషయాలు అసలు ప్రస్తావించలేదని మదన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అభిషేక్ రెడ్డి... పిటిషన్ కొట్టివేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయగా... విచారణ జరిపిన ధర్మాసనం... పునః పరిశీలన జరపాలని హైకోర్టుకు సూచించింది. వాదప్రతివాదులు ఇద్దరూ... వచ్చే నెల 10న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట హాజరుకావాలని తీర్పులో ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన మెరిట్స్‌లోకి తాము వెళ్లడం లేదని తీర్పులో పేర్కొన్న ధర్మాసనం..... విచారణ సందర్భంగా... ఈ కేసులో అన్ని అంశాలు ఓపెన్‌గానే ఉంటాయని తీర్పులో స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: