New Judges to TS High court : హైకోర్టుకు 12 మంది జడ్జిల నియామకానికి కొలీజియం సిఫార్సు - తెలంగాణ ప్రధాన వార్తలు
తెలంగాణ హైకోర్టుకు 12 మంది జడ్జిల నియామానికి కొలీజియం సిఫార్సు
By
Published : Feb 2, 2022, 11:23 AM IST
|
Updated : Feb 3, 2022, 5:04 AM IST
11:21 February 02
హైకోర్టుకు 12 మంది జడ్జిల నియామకానికి కొలీజియం సిఫార్సు
సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు 12 మంది నూతన న్యాయమూర్తుల నియామకానికి పేర్లు సిఫార్సు చేసింది. మంగళవారం దిల్లీలో సమావేశమైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొలీజియం మొత్తం దేశంలోని 7 హైకోర్టులకు 27 మంది పేర్లను సిఫార్సు చేయగా వారిలో ఎక్కువ మందిని తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఏడుగురు న్యాయవాదులను, ఐదుగురు జ్యుడిషియల్ ఆఫీసర్లను న్యాయమూర్తులుగా నియమించడానికి కొలీజియం పచ్చజెండా ఊపింది. మిగిలిన ఆరు హైకోర్టులకు నలుగురు న్యాయవాదులు, 11 మంది జ్యుడిషియల్ అధికారుల పేర్లను ప్రతిపాదించింది. తెలంగాణ నుంచి ప్రతిపాదించిన పేర్లలో న్యాయవాదుల నుంచి కాసోజు సురేందర్, చాడ విజయ భాస్కర్‌రెడ్డి, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫుల్లా బేగ్, ఎన్.వి. శ్రావణ్‌కుమార్ ఉన్నారు. న్యాయాధికారుల నుంచి జి.అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్ దేవరాజ్ నాగార్జున్ ఉన్నారు. కేంద్ర న్యాయశాఖ ఈ పేర్లను ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి పంపి ఆమోదముద్ర వేసిన అనంతరం నియామక ఉత్తర్వులు వెలువడతాయి.
23 నుంచి 11కి తగ్గనున్న ఖాళీలు
తెలంగాణ హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు పనిచేయడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 12 మంది నియామకమైతే ఖాళీలు 11కి తగ్గుతాయి. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం గత ఏడాది ఆగస్టు 17న రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురు జ్యుడిషియల్ ఆఫీసర్ల పేర్లను సిఫార్సు చేయగా కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. తాజా నిర్ణయంతో దాదాపు ఆరునెలల్లో తెలంగాణ హైకోర్టులో 19 న్యాయమూర్తి పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నట్లయింది. కొలీజియం సిఫార్సు చేసిన 12 మందిలో నలుగురు మహిళలున్నారు. ఇద్దరు న్యాయవాదుల కోటాలో, ఇద్దరు జిల్లా న్యాయాధికారుల కోటాలో ఎంపికయ్యారు. వీరితో కలిపి మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10 కానుంది. కొలీజియం తాజా భేటీలో దిల్లీ, పట్నా, బాంబే, కోల్‌కత్తా, ఝార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకూ నూతన న్యాయమూర్తుల నియామకానికి పేర్లు సిఫార్సు చేసింది. ఇందులో ఇంతక్రితం సిఫార్సు చేసిన 8 పేర్లను మళ్లీ ఇప్పుడు ప్రతిపాదించింది.
ప్రతిపాదిత న్యాయమూర్తుల వివరాలివే...
న్యాయవాదుల నుంచి...
కాసోజు సురేందర్:మహబూబ్‌నగర్‌కు చెందిన కె.ప్రమీలాదేవి, కె.లక్ష్మీనారాయణ దంపతులకు 1968లో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను, బీఎస్సీ, న్యాయశాస్త్రం డిగ్రీలను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పూర్తి చేశారు. 1992 డిసెంబరు 15న బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. నాలుగు పర్యాయాలు సీబీఐ న్యాయవాదిగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, ఎన్‌ఐఏల ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, కేంద్రం తరఫున అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. కింది కోర్టులతోపాటు హైకోర్టులో పలు క్రిమినల్, ఆర్థిక నేరాల, ఏసీబీ, సీబీఐ కేసులతోపాటు సివిల్, క్రిమినల్, రాజ్యాంగానికి సంబంధించిన వాటిల్లో వాదనలు వినిపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌చాట్ బాంబు పేలుళ్లు, లుంబినీ పార్కు పేలుళ్లు, దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టిన కేసులు, టెర్రరిస్ట్ హార్బరింగ్ కేసుల్లో ప్రత్యేక కోర్టుల్లో వాదనలు వినిపించారు. రూ.7 వేల కోట్ల కుంభకోణానికి చెందిన సత్యం కేసులో వాదనలు వినిపించగా ప్రత్యేక కోర్టులో నేరం రుజువై నిందితులకు జైలు శిక్ష పడింది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్‌పై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు.
చాడ విజయ భాస్కర్‌రెడ్డి:పూర్వ మెదక్ జిల్లా దుబ్బాకలో 1968 జూన్ 28న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1992 డిసెంబరు 31న న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. ఎన్‌ఐఆర్‌డీ, ఏపీ చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. 2014 నుంచి ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
సూరేపల్లి నంద:సికింద్రాబాద్‌కు చెందిన నంద బి.దానప్ప, మీరాలకు 1969 ఏప్రిల్ 4న జన్మించారు. భర్త ఎస్.మాధవరావు. బి.ఎ., ఎల్‌ఎల్‌బీ చేసిన ఆమె 1993 ఆగస్టు 4న బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. 28 ఏళ్లపాటు పలు రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, కార్మిక, రెవెన్యూ, సర్వీసులకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించారు. న్యాయసేవాధికార సంస్థ లీగల్ ఎయిడ్ ప్యానెల్ న్యాయవాదులకు తెలుగు రాష్ట్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 2000 సంవత్సరం నుంచి బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా కొనసాగుతున్నారు. ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా వ్యవహరించారు. కేంద్రం తరఫున న్యాయవాదిగా పనిచేశారు. నిమ్స్, కార్పొరేషన్ బ్యాంక్‌ల పక్షానా వాదనలు వినిపించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగారు. లా జర్నళ్లకు రిపోర్టర్‌గా పనిచేశారు. 2010లో న్యాయసేవల విభాగం నుంచి ఆచార్య చాణక్య సద్భావన పురస్కారం పొందారు.
ముమ్మినేని సుధీర్ కుమార్:ఖమ్మం జిల్లాలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నాగేశ్వరరావు,భారత లక్ష్మి దంపతులకు 1969 మే 20న జన్మించారు. చర్ల ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యాభ్యాసం పూర్తిచేసి ఏలూరు సర్ సీఆర్‌రెడ్డి కాలేజీలో డిగ్రీ చేశారు. నాందేడ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మరట్వాడ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొంది 1994లో బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. అన్ని విభాగాల్లోని కేసుల్లో హైకోర్టులో వాదనలు వినిపించారు.
జువ్వాడి శ్రీదేవి:జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జువ్వాడి సూర్యారావు, భారతిలకు 1972 ఆగస్టు 10న జన్మించారు. 1997లో బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. నిర్మల్ కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా, 2018 నుంచి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నారు. భర్త కె.శ్రీహరిరావు కూడా న్యాయవాదే.
మీర్జా సైఫుల్లా బేగ్:మహబూబాబాద్‌కు చెందిన న్యాయవాది మీర్జా ఇమామ్‌ఉల్లా బేగ్ కుమారుడు. నవంబరు 12, 1975లో జన్మించారు. 2002 అక్టోబరులో న్యాయవాదిగా నమోదయ్యారు. తండ్రితోపాటు హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్ కేసులతోపాటు సర్వీసు తదితర అన్ని విభాగాల్లోని కేసుల్లో వాదనలు వినిపించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతోపాటు పలు సంస్థల స్టాండింగ్ కౌన్సిల్‌గా, వక్ఫ్‌బోర్డు స్టాండింగ్ కౌన్సిల్‌గాను సేవలందించారు.
ఎన్.వి. శ్రావణ్‌కుమార్:మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు. పీవీ పెద్ద కుమార్తె శారద, సిద్దిపేట జిల్లా గుగ్గిళ్ల గ్రామానికి చెందిన నచ్చరాజు వెంకటకిషన్‌రావు దంపతులకు 1967 ఆగస్టు 18న జన్మించారు. ఉస్మానియా నుంచి బీకాం, ఎల్‌ఎల్‌బీ, మేశ్రా రాంచి బిట్స్ నుంచి ఎంబీయే చేశారు. 2005 నవంబరు 17న బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. సిటీ సివిల్ కోర్టు, ఎన్‌సీఎల్‌టీలతోపాటు హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. సివిల్ కేసులతోపాటు టాక్స్, కంపెనీలా, ఆర్బిట్రేషన్ వంటి వాణిజ్య విభాగాల్లోని కేసుల్లో నైపుణ్యం సాధించారు.
న్యాయాధికారుల నుంచి...
జి.అనుపమా చక్రవర్తి:ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో డాక్టర్ ఎన్.కృష్ణచంద్రరావు, మహాలక్ష్మిలకు 1970 మార్చి 21న జన్మించారు. విశాఖపట్నంలోని ఎన్‌బీఎం లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన అనంతరం ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1994లో బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యాక సివిల్, క్రిమినల్ కోర్టులు, కోఆపరేటివ్ ట్రైబ్యునల్‌తోపాటు ఇతర ట్రైబ్యునళ్లు, హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2006లో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2008 నవంబరు 2న జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో పనిచేశారు. కరీంనగర్ జిల్లా జడ్జిగా, తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీగా, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, కోఆపరేటివ్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ప్రస్తుతం వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.
మాటూరి గిరిజా ప్రియదర్శిని:విశాఖపట్నంలోని మాటూరి అప్పారావు, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. అక్కడ ఎన్‌బీఎం లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీలో మూడు పీజీ కోర్సులు చేశారు. లేబర్ అండ్ ఇండస్ట్రీ లాలో మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు. వ్యాపారం రంగంలో ఉన్న విజయ్‌కుమార్‌తో వివాహం అయింది. వివాహం అయ్యాక విద్యాభ్యాసం కొనసాగిస్తూ కుటుంబంతోపాటు కెరీర్‌కు బాటలు వేసుకున్నారు. 1995లో బార్‌కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యాక విశాఖ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. జిల్లా జడ్జి పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే 2008 నవంబరు 3న ఎంపికయ్యారు. అదనపు జిల్లా జడ్జిగా గుంటూరు, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో, ఖమ్మం కుటుంబ న్యాయస్థానం జడ్జిగా, ప్రకాశం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా జడ్జిగా పనిచేసి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జడ్జిగా కొనసాగుతున్నారు. సంగీతం, శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉంది.
సాంబశివరావు నాయుడు:ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన సత్యనారాయణ, సూర్యవతి దంపతులకు 1962 ఆగస్టు 1న జన్మించారు. స్థానికంగా విద్యాభ్యాసం పూర్తి చేసి, అమలాపురం ఎస్‌కెబీఆర్ కాలేజీలో బీకాం, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986లో న్యాయవాదిగా రామచంద్రాపురంలోనే ప్రాక్టీస్ ప్రారంభించారు. 1991లో జిల్లా మున్సిఫ్‌గా ఎంపికై జూనియర్, సీనియర్ సివిల్, అదనపు జిల్లా జడ్జిగా హుజూరాబాద్, కరీంగనర్, వరంగల్, కొత్తగూడెం, తిరుపతిల్లో పనిచేశారు. జిల్లా జడ్జిగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుల్లో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఏసీబీ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2019 నుంచి పనిచేస్తున్నారు.
ఏనుగు సంతోష్‌రెడ్డి:జగిత్యాల జిల్లా జోగిన్‌పల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు నారాయణరెడ్డి, లింగమ్మలకు జన్మించారు. జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్, అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ లా పూర్తి చేశారు. 1985లో బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయి కరీంనగర్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1991లో జిల్లా మున్సిఫ్‌గా ఎంపికై సీనియర్ సివిల్ జడ్జిగా, జిల్లా జడ్జిగా పదోన్నతులు పొందారు. అదనపు జిల్లా జడ్జిగా సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేశారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలోను, అనంతరం తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2018లో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీగా, 2019 నుంచి తిరిగి న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులై కొనసాగుతున్నారు.
డాక్టర్ దేవరాజ్ నాగార్జున్:ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో 1962 ఆగస్టు 15న దేవరాజ్ రామకృష్ణారావు, విమలాదేవిలకు జన్మించారు. వనపర్తిలోని ఆర్‌ఎల్‌డీలో బీఎస్సీ, గుల్బర్గా ఎస్‌ఎస్‌ఎల్ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. గుల్బర్గాలో ఎంఎల్ పూర్తి చేసి కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంఎ చేశారు. నల్సార్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1986లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యాక వనపర్తి కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1991 మే 1న జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. సీనియర్ సివిల్ జడ్జి, అదనపు జిల్లా జడ్జి, జిల్లా జడ్జిగా పలు జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రార్ జ్యుడిషియల్‌గా పనిచేశారు. ప్రస్తుతం రిజిస్ట్రార్ జనరల్‌గా కొనసాగుతున్నారు. హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటైన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్ డీడ్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.