ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పు వెలువరించే క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ నెల 8న ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సమ్మతం తెలిపింది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు అనుమతిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు ఆపేందుకు సహేతుక కారణాలు లేవన్న హైకోర్టు.. రాజ్యాంగంలోని 9, 9(A) షెడ్యూల్ ప్రకారం కాలపరిమితిలోగా ఎన్నికలు తప్పనిసరని స్పష్టం చేసింది. తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని తేల్చిచెప్పింది. ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం ఎస్ఈసీదేనన్న హైకోర్టు.. సీఈసీకి ఉన్న అధికారాలే ఎస్ఈసీకి ఉన్నాయని తెలిపింది.
సింగిల్ బెంచ్ తీర్పు ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించిన హైకోర్టు.. ఎస్ ఈసీకి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని సూచించింది. ఎన్నికైన నేతలు వ్యాక్సినేషన్ ను ముందుకు తీసుకువెళ్తారని చెప్పింది. వ్యాక్సినేషన్ పేరుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా కోరడంలో సహేతుకత లేదంది. మూడో దశలో భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉన్నందున ఈలోపు ఎన్నికలు నిర్వహణ సబబేనని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అమెరికాతోపాటు మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.