హైదరాబాద్‌లో విలువైన హఫీజ్‌పేట భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. హఫీజ్ పేటలోని సర్వే నంబర్ 78లోని 8 ఎకరాల భూములపై క్రాఫ్ట్ ఎల్లాయ్ సంస్థకు హైకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వే నంబర్ 80లోని సినీ నిర్మాత సి.కల్యాణ్ కొనుగోలు చేసిన భూమిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జీహెచ్ఎంసీ సుప్రీంలో సవాల్ చేసింది.
ఈ పిటిషన్లపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్‌షా ధర్మాసనం విచారించింది. తెలంగాణ పట్టాదారు పాసుపుస్తకం చట్టం, జాగీర్దారు రద్దు చట్టం ప్రకారం హఫీజ్‌పేట భూములను ఎవరికీ బదిలీ చేయకూడదని.. ఆ భూములపై తెలంగాణ ప్రభుత్వానికే హక్కు ఉందని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదించారు. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని క్రాఫ్ట్ ఎల్లాయ్ సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.