తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓ రాజకీయ పార్టీ పిటిషన్‌ను హైకోర్టు ఎలా స్వీకరించింది: సుప్రీంకోర్టు - Inquiry Supreme Court on purchase of MLAs

Supreme Court On MLAs Poaching Case: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఓ రాజకీయ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకుంది.. విచారణకు ఎలా స్వీకరించిందంటూ.. సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తమకు రిమాండ్‌ విధించడాన్ని సవాల్‌ చేస్తూ నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

Supreme Court On MLAs Poaching Case
Supreme Court On MLAs Poaching Case

By

Published : Nov 5, 2022, 8:51 AM IST

ఓ రాజకీయ పార్టీ పిటిషన్‌ను హైకోర్టు ఎలా స్వీకరించింది: సుప్రీంకోర్టు

Supreme Court On MLAs Poaching Case: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తమకు రిమాండ్‌ విధించడాన్ని సవాల్‌ చేస్తూ నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వి.విశ్వనాథన్‌ వాదనలు వినిపించారు.

ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో 41(ఏ) నోటీసు ఇవ్వకుండా నిందితులను అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నా అందుకు విరుద్ధంగా అరెస్టు చేశారని కె.వి.విశ్వనాథన్‌ తెలిపారు. ఫిర్యాదుదారులు నిఘా బృందానికి కాకుండా సాధారణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ట్రాప్‌ చేశారని ధర్మాసనానికి తెలిపారు. దర్యాప్తుపై స్టే కోరుతూ భారతీయ జనతా పార్టీ హైకోర్టును ఆశ్రయించిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం దర్యాప్తుపై స్టే విధించాలని ఓ పార్టీ ఎందుకు పిటిషన్‌ దాఖలు చేసిందని, హైకోర్టు ఎలా విచారణకు స్వీకరించిందని ప్రశ్నించింది.

తాము నలిగిపోతున్నాం:భాజపా పిటిషన్‌కు, తమకు సంబంధం లేదని నిందితుల తరఫు న్యాయవాది విశ్వనాథన్‌ స్పష్టం చేశారు. భాజపా, తెరాసల పోరులో తాము నలిగిపోతున్నామని, ఎవరో పిటిషన్‌ దాఖలు చేస్తే తమను నిందిస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భాజపా ఎవరని ప్రభుత్వ న్యాయవాది లూథ్రా ప్రశ్నించారు. ఈ దశలో జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ జోక్యం చేసుకున్నారు. పిటిషన్‌ దాఖలుకు ఆ పార్టీకి ఉన్న అర్హత ఏమిటని హైకోర్టు ప్రశ్నించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

‘ట్రాప్‌ కేసుల్లో నిందితులను సాధారణంగా అదే రోజు విడుదల చేస్తారు.. డబ్బు కూడా స్వాధీనం కాలేదు కదా’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నేరం చేశారని భావిస్తే పోలీసులు అరెస్టు చేయవచ్చని లూథ్రా తెలిపారు. హైకోర్టు విచారణలో ఏం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. దర్యాప్తును హైకోర్టు పెండింగ్‌లో పెట్టి తమ చేతులు కట్టివేసిందని లూథ్రా బదులిచ్చారు. వాదనల అనంతరం.. ‘నిందితుల బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టడానికి ఈ కోర్టుతో పాటు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు అడ్డంకి కాదని.. నిబంధనల ప్రకారం విచారణ చేపట్టవచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

విచారణ సోమవారానికి వాయిదా: కేసు పూర్వాపరాల ఆధారంగా ట్రయల్‌ కోర్టు పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆ తర్వాత కూడా తాము దాఖలు చేసిన రిమాండ్‌ అప్లికేషన్‌ను పరిశీలించేలా ట్రయల్‌ కోర్టును ఆదేశించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది లూథ్రా ధర్మాసనానికి పదే పదే విజ్ఞప్తి చేయగా.. ఇలానే కోరితే నిందితులకు బెయిల్‌ ఇచ్చేస్తాం అంటూ ఆయనను ధర్మాసనం హెచ్చరించింది.

ఇవీ చదవండి:'ఎమ్మెల్యేల ఎర' కేసు విచారణ సోమవారానికి వాయిదా

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. స్టే ఎత్తివేయాలని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

ఆనవాయితీగా వస్తున్న పద్ధతిని మారుస్తారా? మార్పుకే ఓటెస్తారా?

ABOUT THE AUTHOR

...view details