తెలంగాణ

telangana

ETV Bharat / state

రఘురామకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు - సుప్రీం కోర్టు లేటెస్ట్​ వార్తలు

bail, supreme court
రఘురామకృష్ణరాజు

By

Published : May 21, 2021, 4:57 PM IST

Updated : May 21, 2021, 5:29 PM IST

14:43 May 21

రఘురామకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపులా పోటాపోటీగా వాదనలు సాగాయి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దవే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కొన్ని షరతులు విధిస్తూ ఈ మేరకు తీర్పు వెలువరించింది. కస్టడీలోకి తీసుకొని విచారించేటంత తీవ్రమైన ఆరోపణలు కావని, అందువల్ల రఘురామకు కస్టోడియల్‌ విచారణ అవసరం లేదని సుప్రీం పేర్కొంది. అయితే, ఆయన దర్యాప్తునకు సహకరించాలని చెప్పింది. అవసరమైప్పుడు 24 గంటల ముందుగా అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించవచ్చని సుప్రీం స్పష్టం చేసింది. అంతకు ముందు  ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీం పరిశీలించింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ‘‘ఆర్మీ ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదు. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో గాయాలకు గల కారణాలు లేవు. గుజరాత్‌ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో ఎలా పిటిషన్‌ దాఖలు చేస్తారు?’’ అని దవే సుప్రీంకు తెలిపారు. రఘురామ రెండు వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడారని అన్నారు.

సమాజంలో అలజడి సృష్టించేందుకు రఘురామ ప్రయత్నించారు

‘‘ఎంపీ రఘురామ హద్దులు మీరారు. కరోనావేళ ఇదంతా సరికాదని ఆయనకు సమయమిచ్చాం. సీఐడీ అధికారులు ఎంపీకి సంబంధించిన 45 వీడియోలు సేకరించి విచారణ చేపట్టారు. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి సృష్టించేందుకు రఘురామ ప్రయత్నించారు. ఇవన్నీ రాజద్రోహం కిందికే వస్తాయి’’ అని దవే కోర్టుకు తెలిపారు. రఘురామకృష్ణరాజు ఎంపీ అని ముకుల్‌ రోహత్గీ పదేపదే చెబుతున్నారనీ, చట్టం అందరికీ ఒక్కటేనని దవే అన్నారు. ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్లు కాదన్నారు. హైకోర్టు బెయిల్‌ కోసం కింది కోర్టుకు వెళ్లమని చెప్పిందని, ఎంపీ అయినంత మాత్రాన బైపాస్‌లో నేరుగా సుప్రీం కోర్టుకు ఎలా వస్తారు? అని దవే  ప్రశ్నించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికపై తాము అభ్యంతరం చెప్పడం లేదని, అదే సమయంలో జీజీహెచ్‌ ఆస్పత్రి నివేదిక కూడా సరైనదేనని కోర్టుకు తెలిపారు. అలాగైతే ఎంపీ కాలికి ఫ్రాక్చర్‌ గురించి ఏం చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. సమయం ఎక్కువగా లేదని ధర్మాసనం గుర్తు చేయగా.. రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నందున విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని దవే కోరారు. గుంటూరు జైలు నుంచి ఆర్మీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తామంటే ఎంపీ నిరాకరించారనీ, తన కారులో వెళ్తూ అభివాదం చేశారనీ, ఆ సమయంలో కాలిగాయాలు చూపించారనీ చెప్పారు.

ధర్మాసనం మందలింపు

అంతకుముందు రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాది రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. జగన్‌ బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ వేశారన్న నెపంతోనే ఆయనపై కక్షపెంచుకున్నారని కోర్టుకు తెలిపారు. జగన్‌ ప్రతివాదిగా లేనందున దీనిలోకి ఆయన్ను లాగొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే అన్నారు. పిటిషనర్‌గా తాను చెప్పాలనుకున్నది తాను చెబుతానని రోహత్గీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు న్యాయవాదులు ఎందుకు తగవులాడుకుంటున్నారని ధర్మాసనం మందలించింది. బెయిల్‌ రాకుండా ఉండటం కోసమే రాజద్రోహం కేసు పెట్టారని రోహత్గీ ఆక్షేపించారు. అరెస్టు, మెజిస్ట్రేట్‌, హైకోర్టు విచారణ పరిణామాలను రోహత్గీ కోర్టుకు వివరించారు.  అనంతరం ఆర్మీ ఆస్పత్రి వైద్య పరీక్షలను ఆయన ప్రస్తావించారు. కాలి బొటనవేలు పక్కన ప్రాక్చర్‌ అయ్యిందని వైద్యులు తెలిపారన్నారు. సీఐడీ అదుపులో ఉండగా ఎంపీని చిత్రహింసలు పెట్టిన విషయం నిజమేనని వైద్యనివేదికతో నిర్ధారణ అయ్యిందన్నారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరారు. సిట్టింగ్‌ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ముకుల్‌ రోహత్గీ ప్రశ్నించారు. కేదార్‌నాథ్‌ తీర్పులో రాజద్రోహం పెట్టే కారణాలు వివరించారు. కానీ, ఈ సందర్భంలో రాజద్రోహం పెట్టిన కారణం పూర్తిగా బోగస్‌ అని రోహత్గీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇరువురి వాదనల అనంతరం న్యాయస్థానం.. రఘురామకృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఇదీ చదవండి:సెంట్రల్​ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట

Last Updated : May 21, 2021, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details