కాలేజీ యాజమాన్యం అనుసరించిన చట్టవిరుద్ధమైన వైఖరి కారణంగా ఎంఎస్ సర్జరీలో సీటు కోల్పోయిన ఓ వైద్య విద్యార్థికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు సోమవారం హైదరాబాద్‌లోని కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఆదేశించింది. సీటు కోల్పోయిన సదరు విద్యార్థికి వచ్చే విద్యా సంవత్సరంలో మేనేజ్‌మెంట్ కోటా కింద ప్రవేశం కల్పించాలని ఆదేశిస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. నీట్-2020లో ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థిని మోతుకూరు శ్రీయ కౌముది ఎంఎస్ సర్జరీ సీటుకోసం కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో తాత్కాలికంగా ప్రవేశం కల్పించిన యాజమాన్యం జులై 29 లేదా 30 తేదీల్లో సాయంత్రం 4గంటల్లోపు కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించింది. ఆ ప్రకారం విద్యార్థిని కళాశాలకు చేరుకున్నప్పటికీ ప్రవేశ ప్రక్రియ పూర్తికాలేదు. ఆ తర్వాత మెరిట్ జాబితాలో తనకంటే వెనకున్న అభ్యర్థికి ప్రవేశం కల్పించినట్టు శ్రీయ కౌముది హైకోర్టును ఆశ్రయించారు. బాధితురాలి వాదనలు విన్న కోర్టు అదనపు సీటు ఏర్పాటుచేసయినా ఆమెకు ప్రవేశం కల్పించాలని ఆదేశించింది.
వైద్య విద్యార్థికి రూ.10 లక్షల పరిహారం చెల్లించండి: సుప్రీం - సుప్రీం కోర్టు తాజా వార్తలు
కాలేజీ యాజమాన్యం అనుసరించిన చట్టవిరుద్ధమైన వైఖరి కారణంగా ఎంఎస్ సర్జరీలో సీటు కోల్పోయిన ఓ వైద్య విద్యార్థికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వచ్చే ఏడాది అదే కోర్సులో సీటివ్వాలని సూచించింది. మెరిట్ జాబితాను అనుసరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైకోర్టు చెప్పిన విధంగా అదనపు సీటు ఏర్పాటుచేయడం సాధ్యంకాదని పేర్కొంటూ నేషనల్ మెడికల్ కమిషన్ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. బాధిత విద్యార్థి ప్రవేశ ప్రక్రియను పూర్తిచేయడంలో కళాశాల యాజమాన్య లోపం ఉందని పేర్కొంది. మెరిట్ జాబితాలో ముందున్న వారికి కాకుండా తర్వాతి స్థానంలో ఉన్న విద్యార్థికి ప్రవేశం కల్పించడాన్ని తప్పుబట్టింది. హైకోర్టు చెప్పినట్లుగా అదనపు సీటు ఏర్పాటుచేయడం సాధ్యం కాదనే భారత వైద్య మండలి వాదనతో ఏకీభవిస్తూ..బాధిత విద్యార్థినికి వచ్చే విద్యాసంవత్సరం అదే కోర్సులో యాజమాన్య కోటా నుంచి సీటు కేటాయించాలని ఆదేశాలిచ్చింది. ఆమె స్థానంలో సీటు పొందిన అభ్యర్థి ప్రవేశాన్ని రద్దుచేయమని చెప్పడం కూడా నిబంధనల ప్రకారం సాధ్యం కాదని స్పష్టంచేసింది. కళాశాల యాజమాన్యం అనుసరించిన అన్యాయమైన విధానంతో బాధిత విద్యార్థి విలువైన ఏడాది కాలాన్ని కోల్పోయినందున, నాలుగు వారాల్లోపు ఆమెకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి:వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: కేటీఆర్