పరిశీలించకుండానే రేషన్ కార్డులను ఎలా రద్దు చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం 2016లో జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా రేషన్ కార్డుల రద్దుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో రేషన్ కార్డులను రద్దు చేశారని, దీనిపై విచారణ చేపట్టాలంటూ సామాజిక కార్యకర్త ఎస్.క్యూ.మసూద్ తొలుత హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ విషయంలో ఉపశమనం కల్పించలేమంటూ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ మసూద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. హైకోర్టు ఉత్తర్వులు గోప్యం(క్రిప్టిక్)గా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కోలిన్ గోంజాల్విస్ వాదనలు వినిపిస్తూ- ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా కంప్యూటర్ లెక్కలను పరిగణనలోకి తీసుకొని కార్డులను రద్దు చేశారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొత్తం ఎన్ని కార్డులను రద్దు చేశారని జస్టిల్ లావు నాగేశ్వరరావు ప్రశ్నించగా.. 21.94 లక్షలు రద్దు చేశారని గోంజాల్విస్ బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది పాల్వాయి వెంకటరెడ్డి వాదనలు వినిపిస్తూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కార్డుల రద్దు జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 23 లక్షల నూతన కార్డులు జారీ చేశామని.. అందులో రద్దయిన వారికి మళ్లీ ఇచ్చామని వెల్లడించారు. కొత్త కార్డులిచ్చారా, రద్దయినవారికే ఇచ్చారా అనే దానిపై స్పష్టత లోపించిందని జస్టిస్ లావు నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్ జోక్యం చేసుకుంటూ రేషన్ డీలర్లు బోగస్ కార్డులను తయారు చేస్తున్నారనే కారణంతో అర్హులకు రేషన్ అందకుండా చేయకూడదని చెప్పారు. జిల్లాస్థాయిలోనే పరిశీలన చేపట్టామని పాల్వాయి వెంకటరెడ్డి ధర్మాసనానికి తెలిపారు. రద్దు చేయడానికి ముందు 21 లక్షల కార్డులను పరిశీలించారంటే మేము నమ్మొచ్చా అని జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రశ్నించారు.