Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ - supreme court news
![Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ Supreme Court allows immersion in Hussain Sagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13079433-thumbnail-3x2-ganesh.jpg)
11:55 September 16
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రం ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి... సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి... ఈ ఏడాదికే మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టంచేసింది. హైదరాబాద్‌లో చాలా ఏళ్ల నుంచి నిమజ్జనం సమస్య ఉందన్న సుప్రీంకోర్టు.. ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదని పేర్కొంది. ఏటా ఎవరో ఒకరు కోర్టుకు వస్తున్నారన్న న్యాయస్థానం... నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వ తీరు సంతృప్తికరంగా లేదని వ్యాఖ్యానించింది. సుందరీకరణ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారన్న సుప్రీంకోర్టు పీవోపీ విగ్రహాల నిమజ్జనంతో కోట్లు వృథా అవుతున్నాయని వ్యాఖ్యానించింది.
హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని ఇచ్చిన తీర్పును... పునఃసమీక్షించాలని కోరుతూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టులో సవాలు చేసుకోవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ ఒక్క ఏడాదికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.