SupremeCourt on GO No.1: ఆంధ్రప్రదేశ్‌లో రహదారులపై సభలు, సమావేశాల నిర్వహణపై.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1పై హైకోర్టు స్టేను సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై.. ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసుపై హైకోర్టు సీజే నిర్ణయం తీసుకున్న తర్వాత విచారణ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. జీవో నెం.1పై రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ విచారణ ముగించిన సుప్రీం.. ప్రస్తుత పరిస్థితుల్లో పిటిషన్‌పై జోక్యం చేసుకోమని వెల్లడించింది.
విచారణను రాష్ట్ర హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపడుతుందని తెలిపింది. వాద, ప్రతివాదులిరువురూ డివిజన్ బెంచ్ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని తెసియజేసింది. అన్ని అంశాలు ఓపెన్‌గా ఉంచుతున్నట్లు పేర్కొంది. కేసు ప్రామాణికతపై ఇప్పుడే ఎలాంటి విచారణ చేపట్టట్లేదన్న సీజేఐ.. ఈనెల 23న విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించారు.
హైకోర్టులో పిటిషన్: బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ జనవరి 2వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్ వన్ను తీసుకొచ్చింది. రాజకీయ పార్టీల గొంతు నొక్కేందుకు తెచ్చిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 12న హైకోర్టు విచారణ జరిపింది. జీవో నంబర్ వన్ను పోలీసు చట్టం సెక్షన్ 30కి విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. జీవోను ఈ నెల 23 వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
జీవో నంబర్ వన్ ద్వారా బహిరంగ సమావేశాలను నిషేధించలేదని, సహేతుకమైన షరతులు విధించడం, ప్రత్యామ్నాయ స్థలాలు సూచించడంపై పోలీసులకు అనుమతిచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. విచారణ ప్రాథమిక దశలోనే జోక్యం చేసుకుని జీవో అమలును నిలిపేయడంలో.. హైకోర్టు పొరపాటు చేసిందని స్పష్టం చేసింది. కౌంటరు వేసేందుకు ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఉండాల్సిందని అందులో పేర్కొంది. పౌరుల భద్రత నిమిత్తం తీసుకొచ్చిన జీవో అమలును నిలిపేయాల్సిన అవసరం లేదంది.