హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం(international arbitration centre) ఏర్పాటు చేయాలన్నది తన చిరకాల స్వప్నమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ(CJI NV Ramana) వెల్లడించారు. అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం, సదుపాయాలున్న హైదరాబాద్ అందుకు అనువైనదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో మంచి భవనం, మౌలిక వసతులు కల్పిస్తే అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించే ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో(KCR) ప్రస్తావించానని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
హైదరాబాద్ రాజ్‌భవన్ అతిథి గృహంలో మంగళవారం తనను కలిసిన హైకోర్టు లీగల్ రిపోర్టర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ జస్టిస్ రమణ పలు అంశాలను ప్రస్తావించారు. కోర్టుల్లో కేసులు పేరుకుపోవడంతో వ్యాపార లావాదేవీల్లో వివాదాలు సత్వరం పరిష్కారం కావడంలేదన్న కారణంగా పలు అంతర్జాతీయ సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి విముఖత చూపుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో ఫార్మా, ఐటీ రంగాలు పుంజుకున్నాయన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలున్నాయని, వీటికి ఏవైనా వివాదాలు తలెత్తితే ఆర్బిట్రేషన్ కోసం వ్యయప్రయాసలకోర్చి సింగపూర్ వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు ఇక్కడికి వస్తారని, వీరి బసకు మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తాను ఇప్పటికే సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేశ్ మీనన్‌తో ఈ విషయాన్ని చర్చించినట్లు తెలిపారు. ఆగస్టులో మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇక్కడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వం తరఫున ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తన పదవీకాలం ముగిసేలోగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.