హైదరాబాద్ నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) దర్యాప్తులో భారీ మాదకద్రవ్యాల రాకెట్ గుట్టురట్టయింది. హైదరాబాద్‌లోని ఓ కొరియర్ సర్వీస్‌లో లభించిన సమాచారం ఆధారంగా 75 రోజులపాటు కూపీ లాగడంతో ఎట్టకేలకు చెన్నైలో మాదకద్రవ్యాల స్థావరం జాడ తెలిసింది. చెన్నై నుంచి మాదకద్రవ్యాల్ని పంపిస్తే దర్యాప్తు సంస్థలకు అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో ఆ ముఠా పన్నిన పన్నాగం.. కొరియర్ సంస్థ ఇచ్చిన సమాచారంతో బెడిసికొట్టింది.
హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ప్రముఖ కొరియర్ సంస్థ నిర్వాహకులకు ఓ పార్శిల్‌పై అనుమానం వచ్చింది. ఆ సంస్థ నిర్వాహకులు గత నవంబరు 7న ఎన్‌సీబీ అధికారులకు సమాచారం అందించారు. పిజ్జా, బర్గర్, శాండ్‌విచ్‌లతో కూడిన పార్శిళ్లను స్కానింగ్ చేయడంతో మాదకద్రవ్యాల జాడలు కనిపించాయన్నది ఆ సమాచారం సారాంశం. అప్రమత్తమైన హైదరాబాద్ ఎన్‌సీబీ అధికారులు వాటిని తెరిచి చూడటంతో అనుమానాలు నిజమయ్యాయి. పిజ్జా, బర్గర్, శాండ్‌విచ్ ప్యాక్‌ల లోపల మాదకద్రవ్యాల్ని అమర్చిన ముఠా.. పైనా, కింద తెలివిగా కవర్లను చుట్టి ఉంచినట్లు గుర్తించారు. కొరియర్ సంస్థలోని ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాల ద్వారా స్కానింగ్ చేయడంతో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న అక్రమ మాదకద్రవ్యాల వ్యవహారం బయటపడింది. కొరియర్ నిర్వాహకులు అదే సమాచారాన్ని ఎన్‌సీబీ అధికారులకు చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా పార్శిళ్లను విప్పి చూసిన అధికారులు వాటిలో ఉన్న 4.35 కిలోల మెథకొలైన్ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ పార్శిళ్లను ఆస్ట్రేలియా పంపేందుకు సిద్ధం చేసినట్లు ఎగుమతి చిరునామా ఆధారంగా గుర్తించారు.