కరోనా మహమ్మారి బారిన పడకుండా కేంద్ర ఎన్నికల సంఘం (Huzurabad CEC Rules) సరికొత్త నియమాలను రూపొందించింది. పశ్చిమ బంగా, తమిళనాడు ఎన్నికల సందర్భంగా జరిగిన లోపాలను సవరిస్తూ కొత్త నిబంధనలు రూపొందించింది. వాటిని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో (Huzurabad CEC Rules) అమలు చేయాలని సూచించింది. అయితే ఎన్నికల కమిషన్ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఆంక్షలను తుంగలో తొక్కేందుకు వీలుగా సమావేశాలను నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. భారీగా జనం గుమికూడదనే ఉద్దేశంతో కొత్త నియమాలను రూపొందించగా.. వాటిని అమలు చేసి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు ఆ నిబంధనల నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రత్యక్షంగా చేసి చూపెడుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా నియోజక వర్గ సరిహద్దులోని కూతవేటు దూరంలో పెంచికలపేటలో సభలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.
నియోజకవర్గానికి నియమావళి పరిమితంతో కొత్త ఎత్తులు..
హుజూరాబాద్ ఉప ఎన్నికల (Huzurabad By Election) నియమావళిపై కమిషన్ స్పష్టత ఇవ్వగా పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా స్టార్ క్యాంపెయినర్ల సభకు కూడా 1,000 మందికి మించకూడదని ఆంక్షలు విధించింది. దీనితో రాజకీయ పార్టీలు ఒకరకంగా ఉక్కిరిబిక్కిరి అయ్యాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళి కేవలం నియోజకవర్గానికే పరిమితం అని ప్రకటించగా ప్రచారం కోసం ప్రత్యమ్నాయాలు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉండటంతో కేవలం నియోజకవర్గంలోనే కాకుండా ఇరుగుపొరుగు సెగ్మెంట్లు వేదికగా మార్చుకునే వెసులుబాటు లభించినట్టయింది. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. మొదట్లోనే ఎన్నికల కమిషన్ కోడ్ జిల్లా వ్యాప్తంగా ఉంటుందని ప్రకటించినప్పటికీ... ఆ తరువాత ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం వరకే అమల్లో ఉంటాయని ప్రకటించడం పార్టీకి వరంగా మారిందనే చెప్పాలి.
కరోనా ప్రోటోకాల్‌తో పాటు నియమావళి..
ఎన్నికల నిబంధనలు (CEC Rules), కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన నిబంధనలు కూడా విధిగా అమలు చేయాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినా... 1,000 మంది మించరాదన్న నిబంధనతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు వంటి వాటిని నిషేధించింది. కేవలం సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. ఆయా సమావేశాలకు హాజరయ్యే వారి వివరాలను రిజిస్టర్ చేయాలని కూడా ఆదేశించింది. కఠినమైన ఈ నిబంధనలను అమలు చేయడం రాజకీయ పార్టీలకు దాదాపు అసాధ్యమైందనే చెప్పాలి. ప్రచారం చేయడం ఎలా అనుకుంటున్న పార్టీలకు ఎన్నికల కోడ్ (Election Code) కేవలం హుజూరాబాద్ నియోజకవర్గం వరకే అమల్లో ఉంటుందని ప్రకటించడంతో ఆయా పార్టీలు ఎగిరి గంతేసినంత పనిచేశాయి.
సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించిన పార్టీలు..