Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరును కృష్ణ మరువలేదు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. తన తల్లి పేరిట ఏర్పాటైన పాఠశాల నిర్మాణానికి సహకారం అందించారు. రూ.12 లక్షల వ్యయంతో గీతా మందిరం నిర్మించారు. కృష్ణ స్పూర్తితోనే ఆయన తనయుడు, నటుడు మహేష్‌బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టారు. తరచూ క్యాంపులు నిర్వహిస్తూ వైద్య సేవలందిస్తున్నారు. కృష్ణ మరణంతో బుర్రిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూపర్‌స్టార్ చిత్రపటానికి గ్రామస్థులు నివాళులర్పించారు. గ్రామాభివృద్ధికి కృష్ణ చేసిన సేవలు ఎనలేనివంటున్నారు.
"నాకు వరుసకు మేనత్త కుమారుడు. బుర్రిపాలెం వస్తుండేవారు. ఇక్కడ సొంత ఊరిలోనే ఇళ్లు ఉంది. వాళ్ల ఆమ్మ గీతామందిరమనే వైష్ణవ ఆలయాన్ని నిర్మించారు. హైస్కూల్ భవనానికి స్థలం ఇప్పించారు."-బుర్రిపాలెం గ్రామస్థుడు
"ఈ రోజు ఆయన లేడు అంటే మా గ్రామానికి చాలా బాధగా ఉంది. మా గ్రామానికి సీసీ రోడ్లు వేయించారు. పాఠశాలను నిర్మించారు. కరోనా సమయంలో రెండు సార్లు గ్రామంలో టీకాలు ఇప్పించారు." -బుర్రిపాలెం గ్రామస్థుడు