BJP senior leaders Telangana visit : తెలంగాణగడ్డపై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయదళం గులాబీ తోటలో కమలాన్ని వికసింపజేసెందుకు వ్యూహాత్మకంగా ముందుకుసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలలే ఉండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టిసారించింది. సమయం వృథా చేయకుండా అందివచ్చిన ప్రతిఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ఎండగట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
BJP senior leaders visits in Telangana : సభలు సమావేశాల పేరిట బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల క్యాలెండర్‌ను సిద్దం చేసుకున్న పార్టీ మూడు నెలలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సాల్.. నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం కూకట్‌పల్లిలో జరగనున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ భేటీకి సునీల్ బన్సాల్ హాజరుకానున్నారు.
మధ్యాహ్నం రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన జరిగే పార్లమెంట్ కన్వీనర్, సహకన్వీనర్, పార్లమెంట్ ప్రభారీ, పార్లమెంట్ విస్తారక్ భేటీలో పాల్గొననున్నారు. రేపు ఉదయం పఠాన్‌చెరువులో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో సునీల్ బన్సల్ పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో పార్టీ పటిష్టత, ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు.