Suicides in Telangana 2023 :వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులతో కేపీహెచ్‌బీ పరిధిలో వరప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి.. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 2న మేడ్చల్ పరిధిలోని వినాయకనగర్‌లో సీసీ కెమెరాలు సర్వీస్ చేసే బుచ్చిరెడ్డి.. కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 3న కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వసంత్ నగర్‌లో నందిని అనే నవ వధువు ఉరి వేసుకుంది. ఈ నెల 5న అశోక్ అనే వ్యక్తి బాలానగర్ పైవంతెన నుంచి దూకి.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన అశోక్.. జీవితంపై విరక్తితో మద్యం మత్తులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Telangana Suicides News :సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో పని చేసే దోమ సతీశ్.. ఈ నెల 6న నాగులపల్లి వద్ద రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. పరిశ్రమ యజమానుల ఒత్తిడే అందుకు కారణమని బంధువులు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో ఈ నెల 7న డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుల్సుంపురా పీఎస్ పరిధిలోని భరత్‌నగర్ బస్తీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న నవ్య ఆత్మహత్య చేసుకుంది. ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నెల 10న సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హమీద్ బస్తీలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ తుకారాం కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Hyderabad Suicides News : కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సౌందర్య.. కోరుకున్న జీవితం దక్కలేదన్న అసంతృప్తితో ఓ భవనం పైనుంచి దూకి చనిపోయింది. బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజుకాలనీలో నివాసం ఉంటున్న అనీశ్‌కుమార్ ఈనెల 12న కుటుంబ కలహాలతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. అదే రోజు ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దని తల్లి మందలించడంతో జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనస్తాపానికి గురైన 18 ఏళ్ల అనిల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 13న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డీపీ కాలనీలో శిరీష అనే గృహిణి కడుపు నొప్పి భరించలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అదే రోజు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో వ్యక్తిగత సమస్యలతో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ రోజు వేర్వేరు చోట్ల మొత్తం ఏడుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు.
బాచుపల్లిలో నారాయణ వసతి గృహం ఐదో అంతస్తు నుంచి దూకి వంశిక అనే ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అదే రోజు సికింద్రాబాద్ బోయిన్‌పల్లి భవానీ నగర్‌కు చెందిన మహిళ తన ఇద్దరు కూతుళ్లతో పాటు ఆత్మహత్య చేసుకుంది. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ విఫలమైందన్న బాధతో మైనర్ బాలుడు ఉరి వేసుకున్నాడు. ఈ నెల 15న కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లో భర్త వేధింపులు భరించలేక వనజ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 17న సరూర్ నగర్‌కు చెందిన విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ భార్య రెహానా బేగం అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది సరూర్ నగర్ చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది.
ఈ నెల 18న మౌలాలి ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి సుజి అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అదే రోజు సికింద్రాబాద్ తుకారం గేట్ పీఎస్ పరిధిలో ప్రేమ విఫలం కావడంతో అజయ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 19 హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ గ్రౌండ్ సమీపంలో సయ్యద్ అఫ్రోజ్ అహ్మద్ అనే వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదేరోజు సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చిన సౌందర్య అనే మహిళ ఇద్దరు పిల్లలను 8వ అంతస్తు నుంచి కిందపడేసి, తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్‌లోని కమ్మదనంకు చెందిన అమరేందర్ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఈ నెల 23న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన 18 ఏళ్ల అమ్మాయి బలన్మరణానికి పాల్పడింది. అదే రోజు మణికొండలో కుటుంబ కలహాలతో తల్లి-కూతురు ఆత్మహత్య చేసుకున్నారు.