ఆత్మహత్య..! పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ వార్తే. బలవన్మరణాల వార్తలు కనిపించని రోజంటూ ఉండటం లేదు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని... ప్రేమలో విఫలమయ్యామని... మానసిక సమస్యలు వెంటాడుతున్నాయని.. కుటుంబ కలహాలతో పడలేకపోతున్నామని... ఇలా రకరకాల కారణాలతో జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు.
బతకటానికి దారి లేదనే అభద్రతాభావమే చాలా మంది ప్రాణాలు బలిగొంటోంది. అసలు ఈ స్థాయిలో ఆత్మహత్యలు పెరిగిపోవటానికి కారణలేంటి..? దేశాలన్నింటినీ పట్టిపీడిస్తున్న ఈ మానసిక సమస్యను అధిగమించటం ఎలా..? ఈ అంశాలపైనే ఎన్నో ఏళ్లుగా మేధోమథనం జరుపుతోంది..అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ సంస్థ-ఐఏఎస్పీ. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య-డబ్ల్యూఎఫ్ఎంహెచ్ ఈ విషయమై కృషి చేస్తున్నాయి. 2003 నుంచి ఏటా సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం నిర్వహిస్తూ వస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఏటా 8 లక్షల మంది ఆత్యహత్యలకు పాల్పడుతున్నారు. 40 సెకన్లకు ఒక బలవన్మరణం నమోదవుతోంది. ఆత్మహత్య చేసుకునేవారిలో 15-29 సంవత్సరాలలోపు వారే అత్యధికంగా ఉన్నారు. 60ఏళ్లు దాటినవారూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. దేశంలో నమోదవుతున్న మరణాల్లో... ఆత్మహత్యలది రెండోస్థానం. ఈ సమస్య పరిష్కారానికి ఐఏఎస్పీ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆత్మహత్యల నివారణకు ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయ సహకారాలు అందిస్తోంది. "ఆత్మహత్యల నివారణకు కలిసి పోరాడుదాం" అన్న నినాదంతో సుమారు 70 దేశాల్లో 300కు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2013లో డబ్ల్యూహెచ్‌వో అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. బలవన్మరణాలను తగ్గించుకునేందుకు ప్రతి దేశం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకోవాలనేది ఆ తీర్మాన సారాంశం. అందుకు చాలా దేశాలు సానుకూలంగా స్పందించాయి. పోలీసులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, మానసిక నిపుణులను అందులో భాగస్వాములను చేస్తూ ఆ దిశగా ఎంతో కొంత కృషి చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో, వైద్యశాలల్లో, కార్యాలయాల్లో మానసిక నిపుణులను, కౌన్సెలర్లను నియమిస్తూ ప్రజల్లో మానసిక స్థైర్యం నింపేందుకు, నిరాశ నిస్పృహలను పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారిలో ఆత్మహత్య చేసుకోవాలనే భావనలను దూరం చేయడంపై దృష్టి సారించాయి.
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ఆత్మహత్యల్లో 75.5 శాతం కేవలం తక్కువ, మధ్య స్థాయి ఆదాయాలున్న దేశాల్లోనివే. అందులోనూ 39 శాతం ఆత్మహత్యలు దక్షిణాసియా దేశాల్లోనే నమోదవుతున్నాయి. ఈ ఆత్మహత్యలకు ఆధునిక జీవితం, ఆదాయాల్లో అసమానతలు, రాబడి, ఖర్చులను సమతూకం చేసుకునే సామర్థ్యం లోపించడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక భారత్‌లో 2015 నుంచి బలవన్మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019లో మొత్తం లక్షా 39 వేల 123 ఆత్మహత్యలు నమోదు కాగా... 2018తో పోల్చితే... ఇది 3.4% అధికం. 2018తో పోల్చి చూస్తే.. 2019లో ఆత్మహత్యల రేటు 0.2% పెరిగింది.