తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ సదుపాయాలు మెరుగైతే 'వందే భారత్​' మరింత వేగంగా.. - Sudhanshu Mani Interview on vande bharat

Sudhanshu Mani Interview : వందేభారత్​ రైలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటోంది దీని గురించే. అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈ హైస్పీడ్​ రైలు గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ అధునాతన శకటం రూపకల్పనలో సుధాంశుమణి అనే అధికారిది కీలక పాత్ర. వందేభారత్​కు సంబంధించి ఆయన ఈనాడు-ఈటీవీ భారత్​తో పంచుకున్న విషయాలు మీకోసం.

వందేభారత్​ రైలు
వందేభారత్​ రైలు

By

Published : Jan 18, 2023, 8:51 AM IST

Sudhanshu Mani Interview : వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. భారతీయ రైల్వే చరిత్రలో ఒక సంచలనం. పూర్తి స్వదేశీ సాంకేతికతతో.. అతి తక్కువ ఖర్చుతో రూపొందిన అద్భుతం. తక్కువ వ్యయంతో అంతరిక్షంలోకి రాకెట్లను పంపటంలోనే కాదు.. అదే పంథాలో హైస్పీడ్‌ రైళ్లను తయారు చేసే సత్తా భారత్‌కు ఉందని ప్రపంచానికి చాటిచెప్పిన ప్రయోగం. ఆకట్టుకునే రూపం.. అదిరిపోయే వేగం.. అంతకుమించి భద్రతా ఏర్పాట్లతో భారతదేశ పట్టాలపై పరుగులు తీస్తున్న అధునాతన శకటం. మరి ఇలాంటి రైళ్లు ఎక్కడ తయారవుతున్నాయి? రూపకల్పన వెనుక ఉన్న మేధస్సు ఎవరిది? చెన్నైలోని ఇంటెగ్రల్‌ కోచ్‌ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) ఇందుకు కేంద్రం కాగా.. సుధాంశు మణి అనే అధికారిది ఇందులో కీలకపాత్ర.

ఆయన ఐసీఎఫ్‌ మాజీ జనరల్‌ మేనేజర్‌. అంతకుముందు జర్మనీలోని భారతీయ రాయబార కార్యాలయంలో రైల్వే వ్యవహారాల మినిస్టర్‌గా విధులు నిర్వర్తించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ సుధాంశుమణిని ఇంటర్వ్యూ చేసింది. అందులోని ముఖ్యాంశాలు..

వందే భారత్‌ రైలు వేగాన్ని మరింత పెంచవచ్చా? అందుకోసం చేయాల్సిందేమిటి?

ఈ రైళ్లు ఓ విప్లవం. తక్కువ వ్యయంతో రూపొందించిన వీటితో అత్యంత విలువైన సమయమూ ఆదా అవుతుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తొలుత వీటికి రూపకల్పన చేశాం. ప్రస్తుతానికి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచేలా తయారుచేశాం. అయితే ఆ వేగాన్ని అందుకోవాలన్నా.. ఆ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉండాలి. ఇప్పుడు 130 కిలోమీటర్ల వేగంతో నడిచేందుకూ అనువైన మౌలిక సదుపాయాలు లేవన్నది అంగీకరించాల్సిందే. దిల్లీ-ముంబయి, దిల్లీ-హావ్‌డా, సికింద్రాబాద్‌- విశాఖపట్నం మార్గాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తే ఆ వేగాన్ని సాధించవచ్చు. భద్రత కోణంలోనూ ఈ రైళ్లు మెరుగైనవే.

ఈ కొత్త తరం రైలు దేశంలో బుల్లెట్‌ రైళ్లకు ప్రత్యామ్నాయమా?

58 ఏళ్ల కిందటే బుల్లెట్‌ రైల్‌ నెట్‌వర్క్‌ ఉంది. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో ప్రారంభించి 310 కిలోమీటర్ల స్థాయికి చేరుకున్నాయి. మనం ఆ స్థాయికి వెళ్లేందుకు కొంత సమయం పడుతుంది. బుల్లెట్‌, హైస్పీడ్‌ రైళ్లు రెండూ అవసరమే. 500 కిలోమీటర్ల దూరంలోపు ఇంటర్‌సిటీ రైళ్లు విమానాలకు పోటీనిస్తాయి. స్లీపర్‌ కోచ్‌లను అందుబాటులోకి తీసుకువస్తే దూరప్రాంత ప్రయాణాలకు ఎంతో ఉపయుక్తం.

విదేశీ కంపెనీ ఒక్కో రైలుకు రూ. 250 కోట్లు ఖర్చు అవుతుందంటే మీరు రూ.వంద కోట్లతో ఎలా రూపొందించారు? సాంకేతికత అంతా భారతీయమేనా?

హైస్పీడ్‌ రైళ్ల తయారీలో ఉన్న టాల్గో కంపెనీ (స్పెయిన్‌)ని సంప్రదించాలని రైల్వే బోర్డు ఆలోచన చేసి ఉంటుందని నేను అనుకోవటం లేదు. వాళ్ల నుంచి సమీకరించుకోవాలని అనుకుంటే ఒక్కో రైలుకు రూ.250 కోట్లు చెల్లించటంతోపాటు కనీసం 15 రైళ్లు ఆర్డర్‌ చేయాల్సి వచ్చేది. ఐసీఎఫ్‌ పరిశోధన బృందంతోపాటు రైల్వే ఉత్పత్తుల తయారీ రంగంలో ఉన్న భారతీయ కంపెనీల చొరవతోనే దేశీయంగా తయారు చేశాం. తయారీలో వంద కీలకాంశాలుంటే మూడు విభాగాల్లో మాత్రమే ప్రపంచ స్థాయికి తగినట్లు లేం. ఏ ఒక్క వస్తువు, సాంకేతికత కోసమూ బహుళ జాతి సంస్థలను ఆశ్రయించలేదు. కన్సల్టెంట్లు, దేశీయ చిన్న సంస్థలనే ఎంచుకున్నాం. ఐసీఎఫ్‌ పర్యవేక్షణ, నియంత్రణలోనే పనులు జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాం. అందుకే వందేభారత్‌ రైలును రూ. వంద కోట్ల కన్నా తక్కువ ఖర్చుతోనే తీసుకురాగలిగాం.

హైస్పీడ్‌ రైలు రూపకల్పన ఆలోచన ఎలా పురుడు పోసుకుంది?

ప్రపంచవ్యాప్తంగా రైల్వే ఆధునికీకరణ పంథాలో సాగుతోంది. మనదేశంలో ఆ విషయంలో పురోగతి లేదు. నాకు నూతన ఆవిష్కరణలపై ఆసక్తి ఎక్కువ. జర్మనీలో భారతీయ రాయబార కార్యాలయంలో మినిస్టర్‌ ఫర్‌ రైల్వేస్‌గా కొంత కాలం పని చేశా. జర్మనీ నుంచి వచ్చిన తరవాత కలను సాకారం చేసుకోవాలన్న తపనతో..ముఖ్యమైన పోస్టింగులు అడగకుండా చెన్నైలోని ఐసీఎఫ్‌లో జనరల్‌ మేనేజర్‌గా పోస్టింగ్‌ అడిగాను. అక్కడి సిబ్బందిలో కూడా ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. ఆవిష్కరణల దిశగా పని చేశాం. సాధించగలిగాం.

కేవలం 18 నెలల్లో ఎలా సాధ్యమైంది?

సమష్టి తత్వంతో పని చేస్తే ఏదైనా సాధ్యమే అన్నది నిరూపించేందుకు ఇదో గొప్ప కేస్‌స్టడీ. ఇదేదో ఐసీఎఫ్‌ ఒక్కటే సాధించిన విజయం కాదు. భారతీయ రైల్వే ఉత్పత్తుల తయారీ పరిశ్రమ తోడ్పాటు ఉంది.

ఇవీ చూడండి..

'వందే భారత్'లో ఛార్జీలు ఎలా ఉంటాయ్​.. రైలు ఎంత వేగంతో పరుగులు పెడుతుందో తెలుసా..?

వందే భారత్ రైలు ప్రయాణం.. అదిరిందంటున్న ప్రయాణికులు

ABOUT THE AUTHOR

...view details