ఉన్నత చదువుల కోసం తనదైన రీతిలో పట్టుదలతో కష్టపడుతోంది వరంగల్‌కు చెందిన రచన. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకున్నా తాను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలని సంకల్పించింది. కలలు కనండి.. వాటిని నెరవేర్చుకోండి అని అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆజాద్ స్పూర్తితో ముందుకుసాగింది. తల్లిదండ్రుల మాదిరిగానే రెక్కల కష్టాన్నే నమ్ముకుంది. అదేవిధంగా బాగా చదువుకోవాలనుకుంది. అందుకే ఓపక్క పనిచేస్తూనే మరోవైపు చదువుకోవాలని నిర్ణయించుకుంది.
స్తోమత లేదు
వరంగల్ అర్బన్ జిల్లా బాలసముద్రంలోని అంబేడ్కర్ నగర్లో నివాసముంటున్న మామిడిపల్లి రవి, సాంబ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెను ఉన్నంతలో చదివించి ఆ తర్వాత పెళ్లి చేశారు. చిన్న కుమార్తె రచన ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఆపై చదివిద్దామనుకుంటే వాళ్ల ఆర్థిక స్తోమతకు మించి ఖర్చవుతుంది. రచన తండ్రి రవి మేస్త్రీ పనులు చేస్తుంటే.. తల్లి సాంబ కూలీకి వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ బిడ్డను ఉన్నత చదువులు చదివించడం వారికి తలకు మించిన భారమే అని భావించారు. కానీ తమ కూతురు అందుకు భిన్నంగా ఆలోచించింది.
రాజధాని బాట
తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించింది రచన. ఉన్నత చదువులు చదువుకునేందుకు రాష్ట్ర రాజధానికి బయల్దేరింది. హైదరాబాద్‌లో వరసకు మామయ్య అయిన గుర్రం యాదగిరి ఉన్నాడన్న భరోసాతోనే వచ్చింది. కానీ తాను ఎంచుకున్న చదువు చదవాలంటే రూ.2.50 లక్షలు ఖర్చవుతుంది. చేతిలో చిల్లిగవ్వలేదు. అయినా ఏమాత్రం అధైర్యపడలేదు. తన లక్ష్యం ముందు తనకు అన్నీ చిన్నవిగానే కన్పించాయి. తన మామయ్య గుర్రం యాదగిరిని ఒప్పించి.. నగరంలో ఏదో ఒక పని కుదుర్చమని ప్రాధేయపడింది.
జొమాటో తొలి గర్ల్
తార్నాకాలోని ఓ పాలకేంద్రంలో ఉదయం సమయంలో పాలు అమ్మే పనిలో చేరినప్పటికీ అవి ఇంటి అద్దెకే సరిపోవడంలేదు. తనకు దగ్గరలో ఉన్న ఓ కిరాణంలో పనిచేయాలని నిర్ణయించుకుంది. అలా నెలకు రూ.9వేలకు పైగా ఆదాయం వచ్చినప్పటికీ అవి తన చదువులకు ఏమాత్రం సరిపోవని తెలిసింది. ఓరోజు దుకాణం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే జొమాటో డెలివరీ బాయ్స్ పుడ్ డెలివరీ కోసం వేగంగా వెళుతుండడం గమనించింది. ఒకరోజు అనుకోకుండా రాజు అనే ఓ డెలివరీ బాయ్‌ని కలిసి తనకు డెలివరీ గర్ల్‌గా పనిచేయాలని ఉందని తెలిపింది. అందుకు ఏం చేయాలో అతడు వివరించాడు. ఆవిధంగా జొమాటో కార్యాలయానికి వెళ్లి రూ.200ల ఫీజు చెల్లించి... టీషర్ట్, పుడ్ బ్యాగ్‌ను తీసుకుంది. డెలివరీ గర్ల్‌కు కావాల్సిన శిక్షణ తీసుకుంది. ఆవిధంగా మే 22న తొలి జొమాటో పుడ్ డెలివరీ గర్ల్‌గా చేరింది.
ఆన్లైన్లో చదువు
జొమాటో గర్ల్‌గా చేరిన రచనకు ద్విచక్రవాహనం లేకపోవడంతో తాను పనిచేస్తున్న కిరాణషాపు యజమాని వద్ద ఉన్న స్కూటీని వాడుకుంటానని తెలిపింది. అందుకు యజమాని అంగీకరించడంతో జొమాటో సంస్థలో పుడ్ డెలివరీ చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం నాచారం, మల్లాపూర్, మల్కాజ్ గిరి, హబ్సిగూడ, సీతాఫల్ మండీ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఆహారం సరఫరా చేస్తోంది. ఒకవైపు డెలివరీ గర్ల్‌గా పనిచేస్తూనే మరోవైపు బల్కంపేట్‌లోని చెన్నయ్ అమృత హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో చేరి ఆన్లైన్లో చదువుకుంటోంది. ఫీజు రూ.2.50లక్షలు అయినప్పటికీ తన పరిస్థితిని కళాశాల యాజమాన్యానికి వివరించడంతో మూడు దఫాల్లో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది.