ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని పశ్చిమ డెల్టా పరిధిలోని లంక గ్రామాల రైతులు మూడో రోజు వరద ముంపు నుంచి కోలుకోలేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద ప్రవాహం తగ్గినప్పటికీ.. దిగువన ఉన్న లంక గ్రామాల్లో ముంపు సమస్య కొనసాగుతూనే ఉంది. కొల్లిపర, కొల్లూరు మండలాల్లోని 21 లంకలు.. భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంక గ్రామాల ప్రజలు వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. బాహ్య ప్రపంచంతో రాకపోకలు ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ కాగా.. వరద ప్రవాహం తగ్గటంతో నిత్యవసరాల కోసం ట్రాక్టర్లు వంటి భారీ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
శాంతించిన కృష్ణమ్మ... కుళ్లిపోయిన పంటలు - farmers lossed crop latest news update
కృష్ణానదికి వరద ప్రవాహం తగ్గినప్పటికీ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా ముంపు ప్రభావం నుంచి కోలుకోలేదు. కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల ప్రజలకు రాకపోకలు ఇప్పటికీ పునరుద్ధరణ కాలేదు. మరోవైపు పంట పొలాల్లో నీరు నిలిచిఉండటంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు లంక గ్రామాల్లో పర్యటించి సహాయక చర్యలపై సమీక్షించారు.
వరద ముంపుతో ప్రధానంగా ఉద్యాన పంటలు పసుపు, కంద, అరటి, మినుము, మిర్చి వంటి పంటలు నీళ్లలోనే ఉండిపోయాయి. వరద ఉధృతికి కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. అయితే మరో రెండు, మూడు రోజులు పంట పొలాల్లో నీరు ఇలాగే నిలిచి ఉంటే.. పంటల కాండం కుళ్లిపోయి దెబ్బతినడం ఖాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో వరదల వల్ల కోలుకోలేని దెబ్బతిన్నామని.. ఈ సారైనా ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాలైన మండలాల్లో ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్ పర్యటించారు. కొల్లిపర మండలం వల్లభాపురంలో పర్యటించిన ఎమ్మెల్యే శివకుమార్ రైతులను ఓదార్చారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరద ముంపు తగ్గాక పంట నష్టాన్ని అంచనా వేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:ద్విచక్రవాహనాన్ని తుఫాన్ ఢీకొని యువకుడు దుర్మరణం
TAGGED:
వరదల్లో పంట నష్టం వార్తలు