తెలంగాణ

telangana

ETV Bharat / state

డిగ్రీలో సబ్జెక్టు కాంబినేషన్లు ఎంచుకోవడంలో బకెట్‌ విధానం! - subject selection in degree as bucket list

మూస ధోరణులు...పాత వాసనలకు దూరంగా జరుగుతూ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది డిగ్రీ కోర్సు. ఈసారి సబ్జెక్టు కాంబినేషన్లు ఎంచుకోవడంలో బకెట్‌ విధానానికీ, బీఎస్‌సీ డేటా సైన్స్‌ అనే కొత్త కోర్సుకూ అధికారులు శ్రీకారం చుట్టారు. కరోనా నేపథ్యంలో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌)ను సులభతరంగా మార్చారు. బయటకు వచ్చి ఏ ఒక్కరితోనూ కలిసే పనిలేకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ప్రక్రియను తీర్చిదిద్దారు!

subject selection in degree as bucket list
డిగ్రీలో సబ్జెక్టు కాంబినేషన్లు ఎంచుకోవడంలో బకెట్‌ విధానం!

By

Published : Jun 26, 2020, 5:46 PM IST

రాష్ట్రంలో ఇంటర్‌మీడియట్‌ ఉత్తీర్ణులైన తర్వాత అత్యధిక మంది ప్రవేశాలు పొందేది డిగ్రీ కోర్సుల్లోనే. ఇంటర్‌లో ఏటా 3 లక్షల మంది ఉత్తీర్ణులవుతుంటే అందులో దాదాపు 2.20 లక్షల మంది డిగ్రీ కోర్సులనే ఎంచుకుంటున్నారు. కొద్ది సంవత్సరాలుగా డిగ్రీ కోర్సులు సైతం ఆధునికంగా మారుతుండటం.. ప్రాంగణ నియామకాలు జరుగుతుండటం...డిగ్రీ చదువుతూనే గ్రూప్స్, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు పోటీపడాలనుకోవడం...బీకాం కోర్సులు పూర్తి చేసినవారికి ఉద్యోగావకాశాలు అధికంగా ఉండటం తదితర కారణాల వల్ల డిగ్రీ కోర్సులకు ఆదరణ తగ్గటంలేదు. ముఖ్యంగా నాణ్యమైన డిగ్రీ కళాశాలలో సీటు వస్తే ఆ విద్యార్థి కెరియర్‌కు ఢోకా ఉండదన్నది వాస్తవం.

దోస్త్‌ ద్వారా ప్రవేశాలు

  • 6 యూనివర్సిటీలు- ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు పరిధిలో..
  • కళాశాలలు: 129 ప్రభుత్వ, 1050 వరకు ప్రైవేటు
  • మొత్తం సీట్లు: దాదాపు 4.50 లక్షలు
  • కోర్సులు: బీఏ, బీకాం, బీకాం ఆనర్స్, బీఎస్‌సీ, బీబీఏ, బీబీఎం, బీబీఎం, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌(బీవోక్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌(బీఎస్‌డబ్ల్యూ), బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(బీసీఏ).

3 విడతల్లో...

ఈసారి మూడు విడతల్లో దోస్త్‌ను ముగించనున్నారు. అంటే విద్యార్థులు జాగ్రత్తగా వెబ్‌ ఆప్షన్లు ఎంచుకుంటే మంచి కళాశాలల్లో సీటు లభిస్తుంది. మొదటి విడతలోనే ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకోవాలి. ఇంటర్‌ మార్కులను, రిజర్వేషన్‌ను అంచనా వేసుకొని ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

దోస్త్‌ వెబ్‌సైట్‌: www.dost.cgg.gov.in

రిజిస్ట్రేషన్‌కు దారులివీ...

  • ఇప్పటికే ఆధార్‌ అనుసంధానం చేసిన స్మార్ట్‌ఫోన్‌ ఉంటే దానితో నేరుగా దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అది లేకుంటే తల్లిదండ్రుల ఫోన్లకు విద్యార్థి తన ఆధార్‌ను అనుసంధానం చేసుకొని ప్రక్రియను కొనసాగించవచ్చు. అంటే కరోనా పరిస్థితుల్లో ఎక్కడా ఇతర వ్యక్తులను కలిసే అవకాశం లేకుండా ప్రక్రియను కొనసాగించవచ్చు.
  • టీ యాప్‌ ఫోలియా మొబైల్‌ యాప్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. రియల్‌ టైమ్‌ డిజిటల్‌ ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ఇది. దీన్ని గూగుల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని ఇంటర్‌ హాల్‌టికెట్‌ సంఖ్యను ఎంటర్‌ చేసి, సెల్ఫీ ఫొటో ద్వారా దోస్త్‌ ఐడీని జనరేట్‌ చేసుకోవచ్చు. ఇది రాష్ట్ర ఇంటర్‌బోర్డు నుంచి ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారికే ఉపయోగపడుతుంది.
  • రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 60 దోస్త్‌ సహాయ కేంద్రాలు(హెచ్‌ఎల్‌సీ)లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి వెళ్లి కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అదీ లేదంటే మీ సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
  • రిజిస్ట్రేషన్‌కు రూ.200 చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థికి దోస్త్‌ ఐడీ, పిన్‌ నంబరు వస్తుంది. వాటిని ఉపయోగించి దరఖాస్తు ఫారం ఓపెన్‌ చేసి వివరాలు నింపాలి. ఆ తర్వాత కోర్సులు, కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఇంటర్‌లో వచ్చిన మార్కుల మెరిట్, సామాజిక రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా సీట్లు కేటాయిస్తారు. దోస్త్‌ ఐడీ, పిన్‌ నంబరును చివరి వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇతరులకు వాటిని చెప్పరాదు.
  • సీటు వచ్చాక సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా సీటును కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కళాశాల, కోర్సు నచ్చకపోతే సీటు రిజర్వేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. తదుపరి విడతల కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
  • విశ్వవిద్యాలయం/ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు పొందిన వారు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు అర్హులైతే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రైవేట్‌ కళాశాలల్లో మాత్రం రూ.500 చెల్లించాలి. ఎక్కడ సీటు వచ్చినా బోధనా రుసుముకు అర్హులుకాని వారు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ సమయంలో రూ.1000 చెల్లించాలి.
  • ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు అర్హతగల వారు 2019 ఏప్రిల్‌ 1 లేదా ఆ తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువపత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి. రిజర్వేషన్‌ ఉన్నవారు ఈ- సేవా కేంద్రం నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలి.

సమస్యలొస్తే..?

  • ఏదైనా సమస్య తలెత్తగానే విద్యార్థులు హైదరాబాద్‌కు, విశ్వవిద్యాలయాలకు తరలిరాకుండా పరిష్కరించేందుకు ఈసారి విస్తృత ఏర్పాట్లు చేశారు.
  • వాట్సాప్‌ చాట్‌బాట్‌ (ఆటో రెస్పాండర్‌) ఏర్పాటు చేశారు. 7901002200 నంబరుకు విద్యార్థులు సమస్యలు పంపొచ్చు. దీని ద్వారా దోస్త్‌ అధికారులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని చేరవేస్తారు. వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి ‘హాయ్‌’ అని పంపిస్తే మీ నంబరు సేవ్‌ అవుతుంది.
  • ఫేస్‌బుక్‌ పేజీ: www.facebook.com/dost.telangana
  • ట్విటర్‌: www.twitter.com/dost.telangana
  • దోస్త్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. దాని ద్వారా వీడియోలు, ప్రశ్నలు-సమాధానాలు పొందొచ్చు.

ఈసారి ప్రత్యేకతలు ఇవీ..

  • ఇప్పటివరకు కేవలం ఇంజినీరింగ్‌కే పరిమితమైన డేటా సైన్స్‌ను ఈసారి బీఎస్‌సీలోనూ తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. అందులో గణితం, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్‌ అనే మూడు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసినవారికి మార్కెట్‌లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
  • మూడు సబ్జెక్టులను ఎంచుకోవడం తప్పనిసరి కాబట్టి వాటిని ఎంచుకోవడంలో విద్యార్థులకు చాయిస్‌ ఇస్తున్నారు. దీన్నే బకెట్‌ విధానంగా పిలుస్తున్నారు. అంటే ఒక్కో బకెట్‌లో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. అలాంటివి నాలుగు బకెట్‌( ఆప్షన్లు)లు ఉంటాయి. ఆ నాలుగులో మూడు బకెట్ల నుంచి మూడు సబ్జెక్టులు ఎంచుకోవాలి.
  • ఈసారి మూక్స్‌ కోర్సులు ప్రవేశపెడుతున్నారు. నాలుగో ఆప్షన్‌లో మీకు ఇష్టమైన సబ్జెక్టు మీరు చేరుతున్న కళాశాలలో లేకున్నా మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సు(మూక్స్‌) విధానంలో దాన్ని చదువుకోవచ్చు. బీఏలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ, సైకాలజీ, మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం అనే అయిదు సబ్జెక్టులను మూక్స్‌ ద్వారా చేయవచ్చు. కళాశాల విద్యాశాఖ వాటిని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు వర్చువల్‌ క్లాస్‌రూమ్‌ ద్వారా అందిస్తుంది. అంటే హైదరాబాద్‌లో ఒక సబ్జెక్టు నిపుణుడు పాఠం బోధిస్తుంటే దాన్ని అన్ని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు వినొచ్చు.
  • సైన్స్, ఇతర కోర్సుల విద్యార్థులు మూక్స్‌ ద్వారా ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకొని పూర్తి చేస్తే ఆ క్రెడిట్లను కలుపుతారు.

ABOUT THE AUTHOR

...view details