కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై రెండు బోర్డులు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి. హైదరాబాద్ జలసౌధ వేదికగా జరిగిన సమావేశంలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు ఎంపీసింగ్, చంద్రశేఖర్ అయ్యర్, రెండు బోర్డుల సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఈఎన్సీలు పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం రెండు రాష్ట్రాలు సహకరించాలని కోరిన బోర్డులు... అవసరమైన సమాచారాన్ని వీలైనంత త్వరగా అందించాలని అన్నాయి. ప్రాజెక్టులు, పంపు హౌస్‌ల్లోని ఉద్యోగులు, సిబ్బంది వివరాలను ఇవ్వాలని కోరాయి. నోటిఫికేషన్‌కు సంబంధించి రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను చెప్పాయి. కొన్ని పాత ప్రాజెక్టులను కూడా అనుమతుల్లేని ప్రాజెక్టులుగా చూపారని... ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపాయి.
పూర్తి స్థాయి కార్యాచరణ అవసరం
గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం పూర్తి స్థాయి కార్యాచరణ అవసరమన్న తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్... నిర్వహణలో వచ్చే ఇతర సమస్యలను బోర్డులు ఎలా పరిష్కరిస్తాయని ప్రశ్నించారు. లారీల కొద్దీ సమాచారం అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ ఫిర్యాదులు చేయగానే వెంటనే తెలంగాణను వివరాలు అడగడం ఏ మేరకు సబబని అన్నారు. కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు గోదావరి బోర్డుకు ఇచ్చామన్న రజత్ కుమార్... మరికొన్నింటివి కూడా ఇస్తామని చెప్పారు. కందకుర్తి, గూడెం ఎత్తిపోతల సహా పది ప్రాజెక్టులు అవసరం లేదని చెప్పినట్లు తెలిపారు.