రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఎల్‌ఆర్‌ఎస్‌లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. కిందటి సంవత్సరం అక్టోబరు 31 చివరి తేదీ కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ అంశం న్యాయస్థానాలకు చేరడంతో ఎల్‌ఆర్‌ఎస్ నిలిచిపోయింది. సుమారు ఏడాదిగా ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్ల క్రయవిక్రయాలకు అవకాశం లేకపోవడంతో కొందరు రియల్టర్లు, ప్లాట్ల యజమానులు దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లకు తెరతీశారు.
అక్రమ లావాదేవీలు ఇలా...
గతంలో ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్లకు సైతం రిజిస్ట్రేషన్లు చేసేవారు. అనుమతుల జోలికి వెళితే.. నిబంధనల ప్రకారం లేఅవుట్‌లలో పార్కులు, రోడ్లు ఇతరత్రా ఖాళీలు వదలాలి. ఈ నేపథ్యంలో వేలకొద్దీ అనధికార లేఅవుట్‌లు ఏర్పడ్డాయి. వీటిలో ప్లాట్లను నకిలీ ఇంటి నంబర్లతోనూ, వ్యవసాయ భూమి పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. పూర్వ ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు మంచిర్యాల పరిధిలోనూ భారీగా ఈ తరహా లావాదేవీలు జరుగుతున్నాయి. కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఇన్‌ఛార్జులుగా ఉన్న సమయంలో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు కానిచ్చేస్తున్నారు. సాధారణంగా రోజుకు 20, 30 లావాదేవీలు జరిగేచోట.. 70... 80 వరకు జరుపుతున్నారు. పూర్వ వరంగల్ జిల్లాలో ఒక సబ్‌రిజిస్ట్రార్ అదనంగా రూ.20 వేలు- రూ.50 వేలు ముట్టజెపితే ఏదైనా సరే రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.