కరోన వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అంతర్జాలాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల తెలంగాణ మహిళ భద్రత విభాగం అధికారులు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. విద్యార్థుల ఆన్‌లైన్ చదువులపై చాలా మంది తల్లిదండ్రులు కన్నేసి ఉంచడం లేదని సర్వేలో తేలింది. ఇది అనర్థాలకు కారణమవుతోందని, కొందరు విద్యార్థులు డార్క్ నెట్లోనూ విహరిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరమని గుర్తించడం లేదని అభిప్రాయపడ్డారు.
ఆన్లైన్లో చదివే విద్యార్థులు నేరాల బారినపడే ప్రమాదం - Students study online are at risk of online crime
కరోనా కట్టడి నేపథ్యంలో అందరూ అంతర్జాల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణం సైబర్ నేరాల ఉద్ధృతికి ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు, ఆన్లైన్లో చదివే విద్యార్థులు ఈ నేరాల బారినపడే ప్రమాదం ఉన్నట్లు తెలంగాణ మహిళా భద్రతా విభాగం తాజా సర్వేలో తేలింది. ఆన్‌లైన్ భద్రతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అవగాహన తెలుసుకునేందుకు గత జూన్లో సర్వే చేపట్టింది. అందులో తేలిన అంశాల ఆధారంగానే ప్రస్తుతం సైబ్-హర్ పేరిట ఆన్లైన్లో నెలపాటు రోజువారీగా అవగాహన సదస్సులు ఆరంభించారు.
ఆన్‌లైన్ నేరాల బాధితుల్లో అత్యధికులు భయం కారణంగా పోలీసుల దృష్టికి తేవడం లేదని వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులకు 4 గంటల సమయం చాలని 85 శాతం మంది తల్లిదండ్రులు సర్వేలో అభిప్రాయపడ్డారు. అధిక శాతం మంది విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని తేలింది. ప్రస్తుత చట్టాల గురించి బాధితులు ఎలాంటి ఆధారాలతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలనే అంశాలపై మహిళలు, యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల సైబ్-హర్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సైబర్ స్పేస్ ద్వారా పిల్లలు, మహిళలపై జరిగే వేధింపుల్ని అరికట్టడం ఎలా అనే అంశంపై వెబ్ ఆధారిత సదస్సు జరిగింది.
ఇదీ చూడండి :భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్