పరీక్షలన్నీ వాయిదా పడటాన్ని విద్యార్థులు ప్రయోజనకరంగా మలచుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ తేదీలు ప్రకటించినప్పుడు చదవచ్చులే అన్న భావన సరికాదని పేర్కొంటున్నారు. అందివచ్చిన అవకాశంగా భావించి ఆగస్టు వరకు సన్నద్ధత తగ్గించకుండా ఉంటే చాలా ప్రయోజనమని చెబుతున్నారు. గత ఏడాది నీట్ వాయిదా కారణంగా వేలల్లో వస్తుందని భావించిన విద్యార్థులు 100 లోపు ర్యాంకు కూడా సాధించారని సబ్జెక్టు నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ సంవత్సరం ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేనందున విద్యార్థులు ఇంటర్ మార్కులు, పరీక్షలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలపై దృష్టి పెట్టడం మంచిదని సూచించారు. ఇంటర్ పరీక్షల తర్వాతే ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి..
దొరికిన అదనపు సమయాన్ని ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు పూర్తిగా చదివేందుకు వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా నీట్‌లో జీవ, రసాయనశాస్త్రాల ప్రశ్నలు 100 శాతం వాటి నుంచే ఇస్తారు. గత ఏడాది నీట్‌లో ఆరో ర్యాంకు పొందిన సింధు అదే పనిచేసి లబ్ధి పొందింది. మా క్యాంపస్‌లో నలుగురు విద్యార్థులు కూడా అదనంగా దొరికిన 3 నెలల సమయంలో ఏకాగ్రతతో చదివి 100లోపు ర్యాంకులు దక్కించుకున్నారు. వాస్తవానికి ఆ అదనపు సమయం లేకుంటే వారి ర్యాంకు వేయిపైబడి ఉండేది. జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) ఆన్‌లైన్‌లో నిర్వహించే నమూనా పరీక్షలను తప్పనిసరిగా రాయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. - కె.రవీంద్రకుమార్,నీట్ శిక్షణ నిపుణుడు
పర్సంటైల్‌ను బట్టి నిర్ణయం అవసరం..
లక్ష్యాన్ని చేరుకోవడానికి అందివచ్చిన ఒక అవకాశంగా విద్యార్థులు భావించాలి. ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. ఆగస్టులో పరీక్షలని సిద్ధం కావాలి. గత ఫిబ్రవరి, మార్చిలో జరిగిన జేఈఈ మెయిన్‌లో 90 పర్సంటైల్ కంటే తక్కువ సాధించిన వారు మెయిన్, అడ్వాన్స్‌డ్‌ను వదిలి ఎంసెట్‌పై దృష్టి పెట్టడం మంచిది. లేకుంటే రెండిటిలోనూ నష్టపోతారు. 90-95 పర్సంటైల్ వాళ్లు జేఈఈ మెయిన్, ఎంసెట్‌కు సన్నద్ధం కావొచ్చు. - కాసుల కృష్ణ చైతన్య, సంచాలకుడు, నానో అకాడమీ