తెలంగాణ

telangana

ETV Bharat / state

చిగురించిన ఆశలు... కోచింగ్‌ కేంద్రాలకు ఫోన్ల మీద ఫోన్లు - telangana news

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజులు రానే వస్తున్నాయంటూ యువత తమ మేధకు సానపెట్టేందుకు సిద్ధమవుతోంది. కలల కొలువుల్ని సొంతం చేసుకునే క్రతువును నిర్విఘ్నంగా సాగించేందుకు నడుంబిగిస్తోంది. ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో రాబోయేది ‘కొలువుల సంక్రాంతే’నని.. నోటిఫికేషన్లు వెలువడటమే తరువాయంటూ ఉద్యోగార్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వేల రూపాయలు వ్యయం చేసి కొత్త పుస్తకాలు, సమాచారాన్ని క్రోడీకరించుకుంటున్నారు. అదే సమయంలో పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. వసతి గృహాలు ఎప్పుటి నుంచి తెరుస్తారంటూ ఆరా తీస్తున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు ఉండబోతున్నాయన్న ప్రభుత్వ సంకేతాల నేపథ్యంలో ఒక్కసారిగా నిరుద్యోగ వర్గాలు, విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి.

preparing for government jobs
చిగురించిన ఆశలు... కోచింగ్‌ కేంద్రాలకు ఫోన్ల మీద ఫోన్లు

By

Published : Dec 21, 2020, 7:09 AM IST

Updated : Dec 21, 2020, 7:49 AM IST

హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అశోక్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అమీర్‌పేట ప్రాంతాల్లోని శిక్షణ కేంద్రాల వద్ద యువత రద్దీ పెరిగింది. వందల మంది కేంద్రాలకు వచ్చి ఆరాతీసి వెళ్లారని కొందరు నిర్వాహకులు తెలిపారు. ఎప్పటి నుంచి శిక్షణ ప్రారంభమవుతుందంటూ జిల్లాల నుంచి వేలాదిగా ఫోన్లు వస్తున్నాయని వివరించారు. పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ, ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి మొదట నియామకాలు చేపట్టవచ్చని నిర్వాహకులు అంచనావేస్తున్నారు. ‘కొంతకాలంగా విద్యార్థులు, నిరుద్యోగుల్లో స్తబ్దత ఏర్పడింది. ఉద్యోగాల భర్తీకి సానుకూల ప్రకటనలు వస్తుండడంతో శిక్షణ గురించి ఆరా తీస్తున్నారు’ అని దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ శిక్షణ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. శాఖల్లోని ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుండటంపై నిరుద్యోగులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూనియర్‌, సీనియర్‌ అసిసెంట్లు, స్టెనో/టైపిస్ట్‌లు, డిప్యూటీ తహసీల్దార్లు, వాణిజ్యపన్నుల అధికారులు, ఆబ్కారీ ఎస్సైలతోపాటు పలు విభాగాల్లోని ఖాళీల వివరాలు ప్రభుత్వానికి చేరితే ఒకట్రెండు నెలల అనంతరం నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలున్నాయని గ్రూప్స్‌కు సంబంధించి శిక్షణ ఇచ్చే సంస్థలు పేర్కొంటున్నాయి.

‘కరోనా’పై ఆందోళన

కరోనా దృష్ట్యా కొన్ని కేంద్రాలు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నాయి. నేరుగా హాజరయ్యేవారికి సంబంధించి కేంద్రాల సామర్థ్యంలో 50% మేరకే అనుమతిస్తున్నారు. ఆన్‌లైన్‌ కన్నా ఆఫ్‌లైన్‌ శిక్షణపైనే అభ్యర్థులు ఆసక్తి చూపుతుండటంతో.. కొవిడ్‌ నిబంధనలు, భౌతికదూరం అమలుపై ఒత్తిడి పెరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రవేశాలు ప్రారంభమయ్యాయి

ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సిద్ధమవ్వడంతో నిరుద్యోగుల నుంచి ఫోన్లు పెరిగాయి. ఇప్పటికే మేం కొన్ని ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నాం. ఇప్పుడు పోలీస్‌, ఉపాధ్యాయ, గ్రూప్‌-1, 2 ఉద్యోగాల భర్తీకి అవకాశాలున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో శిక్షణకు వస్తామంటూ జిల్లాల నుంచి ఫోన్లు చేసి సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. సంక్రాంతి తరువాత 50 శాతం సామర్థ్యంతో తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఏకేఎస్‌ ఐఏఎస్‌ అకాడమీ నిర్వాహకులు తెలిపారు.

ఎప్పుడెప్పుడా అని చూస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్‌ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తుందా అని ఎదురుచూస్తున్నాం. 2018లో నేను బీటెక్‌ పూర్తి చేశాను. అప్పటి నుంచి ఉద్యోగ ప్రకటనల కోసం వేచిచూస్తున్నా. ఇప్పటికే యూపీఎస్సీకి సిద్ధమవుతున్నా.

- చందన, హైదరాబాద్‌

మెటీరియల్‌ కొనుగోలు చేశాం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎదురుచూస్తున్నా. నాతోపాటు అరవై మంది కష్టపడుతున్నాం. నెలకు రూ.ఏడు వేల వరకు ఖర్చు చేస్తున్నాం. నేను ఓపెన్‌ రిజర్వేషన్‌లో ఉద్యోగం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. స్టడీ రూమ్స్‌కు నెలకు రూ.1600 వెచ్చించి ప్రత్యేకంగా చదువుకుంటున్నా.

- చిరంజీవి, హైదరాబాద్‌

పబ్లిషర్స్‌, పుస్తక విక్రయదారులకు ఆనందం

ఉద్యోగాల భర్తీ నిత్యం జరుగుతేనే పబ్లిషర్స్‌, పుస్తక విక్రయదారుల జీవితాలు నడుస్తాయి. కొంతకాలంగా నష్టాల్లో ఉన్నాం. పుస్తకాలు ప్రచురించి సిద్ధం చేసినా కొనుగోళ్లు లేవు. మళ్లీ పండుగ వాతావరణం కనిపిస్తోంది. పుస్తకాల అరల దుమ్ము దులుపుతున్నాం. ఒక్కో అభ్యర్థి రూ.6-8 వేల వరకు కొనుగోలు చేస్తారు.

- రఘు, శ్రీనివాస్‌, వెంకటేశ్వరరావు, పలు సంస్థల పబ్లిషర్స్‌

ఇదీ చూడండి:నేటి నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

Last Updated : Dec 21, 2020, 7:49 AM IST

ABOUT THE AUTHOR

...view details