తెలంగాణ

telangana

ETV Bharat / state

Gurukulas: వారం రోజుల క్వారంటైన్ తర్వాతే తరగతులకు విద్యార్థులు.. - Telangana news

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సెప్టెంబరు 1 నుంచి విద్యాలయాలను నిర్వహించాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఈ మేరకు సొసైటీలు గురుకులాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి.

telangana gurukulas
గురుకుల సొసైటీలు

By

Published : Aug 31, 2021, 7:07 AM IST

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాలు ప్రత్యక్ష బోధనకు సిద్ధమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సెప్టెంబరు 1వ తేదీ నుంచి విద్యాలయాలను నిర్వహించాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఈ మేరకు సొసైటీలు గురుకులాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఈ ఆదేశాల ప్రకారం.. ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. పట్టణాలు, గ్రామాల నుంచి గురుకులాలకు వచ్చే విద్యార్థులను వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. కొవిడ్‌ లక్షణాలు లేకుంటేనే రెగ్యులర్‌ తరగతులకు అనుమతిస్తారు. ప్రతి క్వారంటైన్‌ గదికి ఒక ఉపాధ్యాయుడిని ఇన్‌ఛార్జిగా నియమిస్తారు. విద్యాలయ ఆవరణ, తరగతి గదులు, వంటశాలలను స్థానిక సంస్థల సహకారంతో ప్రతిరోజూ శానిటైజ్‌ చేయించాలని, ఉపాధ్యాయులు, సిబ్బంది నిత్యం హాజరుకావాలని ఆదేశించాయి.

తల్లిదండ్రులతో సంప్రదింపులు..

ప్రత్యక్ష బోధనకు సొసైటీలు అనుమతి ఇవ్వడంతో పిల్లలను విద్యాలయాలకు పంపించాలని ఆయా గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. వీటి నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తల్ని వివరిస్తున్నారు. గురుకులాల్లో అనారోగ్యానికి గురైన విద్యార్థులకు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించాలని సొసైటీలు సూచించాయి. ఒక్కరికి పాజిటివ్‌ వచ్చినా అందరికీ పరీక్షలు చేయిస్తారు.

కరోనా కేసుల సంఖ్య పెరిగితే వెంటనే జిల్లా కలెక్టరు, జిల్లా వైద్యాధికారికి సమాచారమివ్వాలని ప్రాంతీయ గురుకుల సొసైటీల సమన్వయకర్తలకు సొసైటీలు సూచించాయి. క్వారంటైన్‌లో ఉన్న, పూర్తయిన విద్యార్థులకు వేర్వేరుగా భోజన సమయాన్ని కేటాయించాలని తెలిపాయి. విద్యార్థుల భోజనాలకు సరిపడా సరకులు సమకూర్చుకోవాలని ప్రిన్సిపాళ్లకు సొసైటీలు ఆదేశాలు జారీ చేశాయి. వాటిని టెండరు ద్వారా సమకూర్చుకునేందుకు మంగళవారం వరకు గడువు ఇచ్చాయి.

ఇదీ చదవండి: MALLARAM PUMP HOUSE: మల్లారం పంపుహౌస్​లోకి వరద నీరు.. నీటి సరఫరాకు అంతరాయం

ABOUT THE AUTHOR

...view details