ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు వసతి గృహాలు అత్యంత దీనస్థితికి చేరుకున్నాయి. ఎప్పుడు ఏ పెచ్చు ఊడిపడుతుందో.. ఏ ఫ్యాన్ మీద పడుతుందో.. ఏ తీగ తగిలి షాక్ కొడుతుందో.. పాము కరుస్తుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
వర్సిటీలో 18 హాస్టళ్లు ఉన్నాయి. దాదాపు 12 వేల మంది విద్యార్థులు ఉంటున్నారు. కొన్ని హాస్టళ్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పైకప్పుల నుంచి నీరు కారుతున్నాయి.
*బి హాస్టల్ ఏ సమయంలో కూలుతుందోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు.
*ఈ1, ఈ2, డి హాస్టళ్లూ అధ్వానంగా మారాయి. రేకుల షెడ్లు కావడంతో పైకప్పులు పాడయ్యాయి. వర్షాలు ప్రారంభం కాగానే.. నీరు కారుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇక్కడ పెద్దసంఖ్యలో విద్యార్థులు ఉంటున్నారు. సరిపడా మరుగుదొడ్లు లేవు. శుభ్రం చేయకపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తున్నాయి. నల్లాలు పూర్తిగా పాడై చుక్క నీరు రావడం లేదు. హాస్టళ్ల తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. విద్యుత్తు తీగలు బయటకు వేలాడుతున్నాయి. తాగునీరూ లభించడం లేదు.
*నాలుగురోజుల కిందట ఈ1 హాస్టల్‌కు చెందిన ఓ విద్యార్థిని పాము కరిచింది. అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
*బాలికల హాస్టళ్లలో పరిమితికి మించి ఉండడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
నిధులు కరిగాయి.. నీళ్లు కారుతున్నాయి
సి హాస్టల్ పరిస్థితి భిన్నం. మరమ్మతుల విషయంలో కామధేనువుగా మారింది. సుమారు రూ.1.20 కోట్ల వ్యయంతో నాలుగైదు నెలల కిందటే మరమ్మతులు చేశారు. నిధులు కరిగించేసి.. సమస్యలను పరిష్కరించలేదని విద్యార్థులు చెబుతున్నారు. వాన పడితే పైకప్పు లీకేజీలతో ఫ్యాన్ల మీద వర్షపునీరు కారుతూ ప్రమాదకరంగా మారింది.
* ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్ భవనం గోడలకు పైపులు కారి పాచిపట్టి అధ్వానంగా తయారయ్యాయి. నీటి లీకేజీల కారణంగా నీరు వృథా అవుతోంది.
మిగిలిన విశ్వవిద్యాలయాల్లోనూ..
*కోఠి మహిళా కళాశాలను తెలంగాణ తొలి మహిళా విశ్వవిద్యాలయంగా మార్చారు. ఇక్కడ సరిపడా హాస్టల్ భవనాలు లేవు. యూజీ స్థాయిలో 450 మంది విద్యార్థినుల సామర్థ్యంతో హాస్టళ్లు ఉండగా.. ఏకంగా వెయ్యి మంది ఉంటున్నారు. జేఎన్‌టీయూలోని హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి.