తెలంగాణ

telangana

ETV Bharat / state

New Courses in Degree : 'డిగ్రీలో కొత్త కోర్సులు.. ఆసక్తి చూపుతున్న విద్యార్థులు'

New Courses in Degree : ఒకప్పుడు డిగ్రీ అంటే.. బీఏ, బీకాం, బీఎస్సీ. గతంలో ఈ మూడు విభాగాల్లో నాలుగు, అయిదు రకాల కోర్సులే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఈ కోర్సులకు తోడు కొత్తగా మరికొన్ని కూడా అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులూ వాటిలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో మంచి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో వాటిలో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

New Courses in Degree
డిగ్రీలో కొత్త కోర్సులు

By

Published : Apr 4, 2022, 7:14 AM IST

New Courses in Degree : రాష్ట్రంలో ఈ ఏడాది బీఏ, బీకాం విభాగాల్లోని కొత్త కోర్సులకు డిమాండ్‌ పెరిగింది. 2021-22 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 947 డిగ్రీ కళాశాలల్లో 4.16 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ విద్యను ఎంచుకున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ విభాగాల్లోని వివిధ రకాల కోర్సుల్లో 1.97 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఇటీవలి కాలంలో డిగ్రీలో వివిధ రకాల కాంబినేషన్లతో సుమారు 120 కోర్సుల వరకు వచ్చాయి. భవిష్యత్తు ఉపాధి అవకాశాల ఆధారంగా వాటిలో చేరడానికి ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

కొన్ని కోర్సుల్లో విద్యార్థుల చేరికలు ఇలా:

*బేగంపేట డిగ్రీ కళాశాలలో బీఏలో 3 కాంబినేషన్లలో సైకాలజీ కోర్సును ప్రవేశపెట్టగా.. అందులో 15 మంది విద్యార్థులు చేరారు. ఇదే కళాశాలలో బోటనీ, జువాలజీ, అప్లయిడ్‌ న్యూట్రిషన్‌ కోర్సును.. 24 మంది చదువుతున్నారు.

*కోఠి మహిళా డిగ్రీ కళాశాలలో ఇతర కాంబినేషన్లతో కూడిన పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును 43 మంది, మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం కోర్సును 104 మంది విద్యార్థులు తీసుకున్నారు. ఇదే కళాశాలలో బీఏలోని హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సులో ఏకంగా 645 మంది విద్యార్థులు చేరారు. బీఏలోని ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సును 997 మంది ఎంచుకున్నారు. మరో కోర్సు హిస్టరీ, తెలుగు, పొలిటికల్‌ సైన్స్‌ కోర్సును 626 మంది ఎంచుకున్నారు.

*కొత్తగా ప్రవేశపెట్టిన హిస్టరీ-పొలిటికల్‌ సైన్స్‌-సోషియాలజీ/ఫిలాసఫి వంటి కాంబినేషన్లతో కూడిన కోర్సులకూ మంచి ఆదరణ దక్కుతోంది. మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌, జాగ్రఫీలో 29 మంది విద్యార్థులు చేరారు. హిస్టరీ-ఉర్దూ-పొలిటికల్‌ సైన్స్‌లో 52 మంది విద్యార్థులు చేరారు.

*ఈ ఏడాది కొత్తగా తీసుకువచ్చిన బీఏ (ఆనర్స్‌)లో 120 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

మూక్స్‌ చదివేలా:డిగ్రీలో మూక్స్‌ (మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌-లీవీవీది) చదివేందుకు యూజీసీ వెసులుబాటు కల్పించింది. దీనికి తగ్గట్టుగా కొన్ని సబ్జెక్టులను మూక్స్‌లో చదివేందుకు ఉన్నత విద్యా మండలి విద్యార్థులకు అవకాశం ఇచ్చింది. నేరుగా ఆన్‌లైన్‌ వనరులను వినియోగించుకుని కోర్సులోని పాఠాలను చదివేందుకు దీని ద్వారా వీలుంటుంది. అధ్యాపకుల కొరత ఉంటే ఇబ్బంది లేకుండా విద్యార్థులు చదువు కొనసాగించొచ్చు. సోషియాలజీ, జాగ్రఫీ, సైకాలజీ, మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి కోర్సులను మూక్స్‌లో చదువుకునే వెసులుబాటు ఉంది.

ఆసక్తి ఉంటే.. ఎన్నో కోర్సులు : "డిగ్రీలో ప్రస్తుతం ఎన్నోరకాల కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులకు ఆసక్తి ఉంటే చాలు.. వేర్వేరు సబ్జెక్టుల కాంబినేషన్లతో చదువుకునేందుకు అవకాశం ఇచ్చాం. బీఎస్సీ విద్యార్థులు సైకాలజీ వంటి సబ్జెక్టులు చదివే వీలు కల్పించాం. విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా కొత్త కోర్సులు ఎంచుకుంటున్నారు. కోర్సులను అదే కళాశాలలో చదవాలనే నిబంధన లేదు. మూక్స్‌, స్వయం వంటి ప్లాట్‌ఫారాల ద్వారా వీటిని ఆన్‌లైన్‌లోనూ చదవొచ్చు."

- ప్రొ.ఆర్‌.లింబాద్రి, ఛైర్మన్‌, ఉన్నత విద్యా మండలి

ఇదీ చూడండి :KTR On Protests: 'మోదీకి సెగ తగిలేలా.. తెలంగాణ తడాఖా చూపించాలి'

ABOUT THE AUTHOR

...view details