Students Crossing Vedavathi River : కన్నడ భాషలో ఆరో తరగతి చదువుకోవాలంటే అక్కడ విద్యార్థులు కష్టాలు పడాల్సిందే... సొంత ఊరిలో అయిదో తరగతి వరకు మాత్రమే ఉంది... అందువల్ల ఆ విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే నిత్యం వేదవతి నదిని దాటాల్సిందే... 40 మందికి పైగా విద్యార్థులు నదిని దాటి కర్ణాటకకు వెళ్తున్నారు. వారే బల్లూరు గ్రామానికి విద్యార్థులు.
Higher study: ఏపీలోని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బల్లూరు పాఠశాలలో ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు కన్నడ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ 103 మంది విద్యార్థులు చదువు సాగిస్తున్నారు. 5వ తరగతి పూర్తి చేసుకున్న తర్వాత ఆరో తరగతికి గుల్యం గ్రామంలో ఉన్న కన్నడ ఉన్నత పాఠశాలకు వెళ్లాలి. కానీ వారు వివిధ రకాల కారణాల వల్ల పాఠశాలకు వెళ్లడం లేదు. బల్లూరు గ్రామ సమీపంలో ఉన్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా తాళ్లూరులో ఉన్న కన్నడ ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్లాలంటే వేదవతి నదిని దాటుకుని వెళ్లాలి. ప్రమాదమని తెలిసినా చదువు కోసం తప్పడం లేదు. వర్షాకాలంలో నది పొంగిపొర్లుతుంది. ఆ సమయంలో నీటి ప్రవాహం తగ్గే వరకు బడికి సెలవు పెట్టాల్సి వస్తుంది. విద్యార్థుల కొన్నేళ్లుగా ఇలాగే వెళ్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.