రాష్ట్రంలో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు విద్యార్థుల హాజరు క్రమంగా పెరుగుతోంది. బడులు ప్రారంభమైన మూడో రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 30.28శాతం విద్యార్థులు హాజరయ్యారు. సర్కారు బడుల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 42.76శాతం విద్యార్థులు హాజరు కాగా... ఎయిడెడ్ పాఠశాలల్లో 16.01 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 22.78శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 53.08శాతం హాజరు నమోదు కాగా... అతి తక్కువగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 17.78శాతం నమోదైంది. సోమవారం నాటికి మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
కొవిడ్ రూల్స్ మస్ట్
కరోనా నేపథ్యంలో మూసేసిన పాఠశాలలు, కళాశాలలు ఈనెల 1 నుంచి పునఃప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా... ఈ నేపథ్యంలో అధికారులు పాఠశాలలను శుభ్రం చేసి భౌతిక తరగతులకు సిద్ధం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. స్వల్ప సంఖ్యలో విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారు. మాస్కులు ధరించి తరగతులకు వస్తున్నారు. పాఠశాలల్లో అధికారులు, యాజమాన్యాలు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించి పాఠశాల్లోనికి అనుమతిస్తున్నారు.