కరీంనగర్లో ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ డ్రైవరు తన కుమారుడిని గత ఏడాది వరకు ప్రైవేట్ బడిలో చదివించారు. ఈ ఏడాది 9వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో(GOVERNMENT SCHOOLS) చేర్పించేందుకు రాగా...టీసీ(transfer certificate) కావాలని చెప్పారు. అది ఇవ్వాలంటే రూ.25వేల ఫీజు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం పట్టుబట్టింది. చివరకు ఎంఈవోను కలిసి విన్నవించడంతో రూ.15వేలకు అంగీకారం కుదిరింది. ఫీజు వివాదం వల్ల బడులు తెరిచి 20 రోజులు దాటినా ఆ విద్యార్థి ఇంటిలోనే ఉన్నాడు.
విద్యా హక్కు చట్టం(RTE) ప్రకారం 8వ తరగతి వరకు టీసీ లేకున్నా ఆధార్ సంఖ్య ఉంటే విద్యార్థి వయసును బట్టి ఆయా తరగతుల్లో చేర్చుకోవచ్చు. 9, 10 తరగతుల్లో వేరే పాఠశాలల్లో చేరాలంటే టీసీ తప్పనిసరి. గత ఏడాది వరకు ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన నేపథ్యంలో ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని యాజమాన్యాలు స్పష్టంచేస్తున్నాయి. తమ పిల్లలు ఒకటిరెండు నెలలే ఆన్‌లైన్ పాఠాలు విన్నారని, ప్రత్యక్ష తరగతులు జరిగినప్పుడూ పంపలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ క్రమంలో రుసుములపై వివాదాలు తలెత్తుతున్నాయి. కొందరు కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నారని మేడ్చల్ జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చెప్పారు. ఫీజును తగ్గించాలని రాజకీయ నాయకులతో చెప్పిస్తున్నారు. రుసుములు చెల్లించలేక కొందరు తమ పిల్లల్ని పాత తరగతుల్లోనే చేర్పిస్తున్నారు. మరికొందరు ఏడాది వృథా అవుతుందని భావించి ఎంతో కొంత చెల్లించి టీసీలు తీసుకుంటున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే కింది తరగతిలో చేర్పించవచ్చన్నారు. చేరాక ఛైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసుకోవాలన్నారు.
ఉపాధి దెబ్బతిని.. సర్కారు బడివైపు