Tele Manas To Remove Exam Fear in Students: ఇంకో వారం రోజుల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో కాస్త ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఎలాంటి సందర్భంలో చదివినా సరే.. వారు ప్రశ్నకు సమాధానం ఇట్టే రాయగలరు.. చెప్పగలరు. మరికొంత మంది ఆ రెండు పనులూ చేయలేరు. ఇంకొందరు క్లాస్‌లో అధ్యాపకులు ప్రశ్నలు అడిగినప్పుడు చక్కగా సమాధానం చెబుతారు.. కానీ పరీక్షలు అంటే మాత్రం ఎక్కడా లేని భయం. ఈ భయంతోనే చదివిన విషయాలు అన్నీ మరిచిపోతున్నారు. ఆ విషయాలను గుర్తుంచుకోవడానికి.. పిల్లలలో పరీక్షల భయాన్ని వదిలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేసి.. టోల్ ఫ్రీ నెంబర్‌ను ఇచ్చింది. ఇప్పుడు ఈ విభాగానికి నిరంతరం అనేకమైన కాల్స్ వస్తున్నాయి.
విద్యార్థులను వెంటాడుతున్న పరీక్షల భయం:ఈ నెల 15 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 9.15 లక్షల మంది విద్యార్థులు హాజరై.. తమ భవిష్యత్తుకు బాటలు వేయాలనుకుంటున్నారు. అయితే పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ.. విద్యార్థుల్లో వారిలో వారికే తెలియని భయం, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే వారిలో భయాన్ని వదిలించడానికి టెలీ-మానస్ అనే ప్రత్యేకమైన కౌన్సెలింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థుల భయాన్ని పోగొట్టడానికి ఒక సైకాలజిస్ట్ ఉంటాడు.
అందుకు 14416 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది. వారు విద్యార్థులు ఎదుర్కొంటున్న పరీక్షల భయాన్ని తొలగించి.. వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతారు. విద్యార్థులకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్‌కు కాల్ చేయాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఈ నెంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని.. సైకాలజిస్టులు కూడా అందుబాటులో ఉంటారని బోర్డు తెలిపింది.