Student Unions Protest against TSPSC Paper Leakage: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ భారతీయ యువమోర్చ డిమాండ్ చేసింది. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ ఆఫీస్ వద్దకు ర్యాలీగా తరలివచ్చివ యువమోర్చా శ్రేణులు... కార్యాలయ ముట్డడికి యత్నించారు. పలువురు కార్యకర్తలు కార్యాలయం గేట్లు ఎక్కి... లోపలకి దూకారు. మరికొందరు టీఎస్‌పీఎస్సీ బోర్డును ధ్వంసం చేశారు.
టీఎస్‌పీఎస్సీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు:అప్పటికే పెద్దఎత్తున పోలీసులు అక్కడ మోహరించినా.... భారీగా తరలివచ్చిన కార్యకర్తలను నియంత్రించలేకపోయారు. ఈ క్రమంలో కాసేపు టీఎస్‌పీఎస్సీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు... ఆందోళనకారులను లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించారు. ప్రశ్నాపత్రం లీకుతో సంబంధం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువమోర్చా నేతలు డిమాండ్ చేశారు.
ఛైర్మన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి: అంతకుముందు కమిషన్ కార్యాలయాన్ని తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం ముట్టడించింది. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. దీనికి బాధ్యులైన ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితారామచంద్రన్‌ను వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షల విచారణ జరిపించాలని కోరారు. ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కాగా... కార్యాలయం ముట్టడిలో భాగంగా టీజేఎస్ విద్యార్థి విభాగం నేతలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం గేటుపై నుంచి దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారిని బేగంబజార్ ఠాణాకు తరలించారు.