Student Unions Protest Against TSPSC Paper Leakage: టీఎస్పీఎస్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరుద్యోగులకు బాసటగా విద్యార్థిసంఘాలతో పాటు రాజకీయ పార్టీలు ఆందోళనల్లో పాల్గొంటున్నాయి. అహర్నిశలు కష్టపడి పరీక్ష రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నినదిస్తున్నారు.
భాగ్యనగరంలో పేపర్ లీకేజీ వ్యవహారంపై మరోసారి ఆందోళనలు హోరెత్తాయి. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు... హైదరాబాద్ బషీర్‌బాగ్ కూడలిలో ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై మోకాళ్ల మీద కూర్చొని నిరసన తెలిపారు. పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఏబీవీపీ కార్యకర్తలు ప్రశ్నించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏబీవీపీ విద్యార్థులు బైఠాయించారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. కోఠి ఉమెన్స్ కళాశాల వద్ద ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు విద్యార్థినులను అడ్డుకున్నారు. కళాశాల ప్రాంగణంలోనే విద్యార్ధినిలు ఆందోళనలు కొనసాగించారు. నేడు ఏబీవీపీ ఆధ్వర్యంలో యూనివర్సిటీల బంద్‌కి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో విద్యార్థులు ధర్నాకు దిగారు. పేపర్ లీకేజీ ఘటనలో ఛైర్మన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాలు:అటు.. పేపర్ లీకేజీ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ... టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ ఆందోళన చేపట్టింది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ విషయంలో నిర్లక్ష్యం వహించిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డిని తొలగించాలని నినాదాలు చేశారు. టీఎస్‌పీఎస్సీ ఏఈ నియామక పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో సీఎం కేసీఆర్ స్పందించాలంటూ పీడీఎస్‌యూ, పీవైఎల్ సంఘాలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించాయి. దీనిపై వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రగతిభవన్ వైపునకు వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి భట్టి ఇవాళ పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. హనుమకొండ నయీంనగర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్ధులు... ధర్నా చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రేయింబగళ్లు చదువుకుంటున్నామని ఇలా ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా... మళ్లీ మళ్లీ పరీక్షలు రాయలేక మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు పేపర్ లికేజ్పై ఆందోళనలు హోరెత్తించారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వర్సిటీ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ బంద్ చేసి 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వెంటనే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన పై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని.. లేదంటే పెద్దఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ఇవీ చదవండి: