దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల జాతీయ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ జాతీయ కమిటీల పిలుపులో భాగంగా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరసన చేపట్టారు. కొవిడ్ నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఏడాది నుంచి ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టలేదని ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు కామ్రేడ్ స్టాలిన్ అన్నారు.
అంబానీ, అదానీలకు మేలు కలిగేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం 600 టన్నుల ఆక్సిజన్ అడిగితే... కేవలం 300 టన్నులు మాత్రమే ఇచ్చిందని అన్నారు. కరోనా బారినపడి ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించకపోవడం దారుణమన్నారు. కేరళ తరహాలో వైద్య సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలకు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు.