హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఓ యువతి ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని లేఖ వదిలి వెళ్లడంతో పాటు నారాయణగూడ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. ఆ యువతిని, ఆమెతో పాటు ఓ అబ్బాయిని గుంటూరులో అదుపులో తీసుకున్న పోలీసులు ఈ నెల 2న హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారించారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది.
యువతికి బాల్యం నుంచే పరిచయం
ఇరువురిది నిజామాబాద్ జిల్లా నవీపేట గ్రామం. ఆ అబ్బాయితో యువతికి బాల్యం నుంచే పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. ఆ సందర్భంలో ఫొటోలు కూడా దిగారు. కొంతకాలానికి విడిపోయీ... ఉన్నత చదువుల నిమిత్తం ఆ యువతి హైదరాబాద్‌కు వచ్చి హాస్టల్‌లో ఉంటూ నారాయణగూడలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుకుంటోంది. ఆ అబ్బాయి కూడా హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేయడానికి నగరానికి వచ్చాడు. ఆ అమ్మాయి ఇక్కడే ఉందని తెలుసుకొని ఆమెకు తరచూ ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి మాట్లాడేందుకు నిరాకరిస్తే కళాశాలకు, హాస్టల్‌కు వెళ్లి పెట్రోల్ పోసి తగులబెడతానని... తానూ చచ్చిపోతానని బెదిరింపులకు దిగేవాడని పోలీసులతో యువతి చెప్పినట్లు తెలుస్తోంది.
ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించాడు..
తన దగ్గరున్న ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. అతన్ని వదిలించుకునేందుకు ఆమె సెల్‌ఫోన్ నంబరు మార్చింది. దీంతో ఆమె రూమ్‌మేట్‌కు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని... తన గదికి రావాలని బెదిరించాడు. ఫొటోలు వైరల్ చేస్తే కుటుంబమంతా వీధినపడుతుందని.. చావే తన సమస్యకు పరిష్కారంగా భావించానని పోలీసుల ముందు ఆ యువతి వాపోయింది. దీనితో విసిగిపోయిన యువతి ట్యాంక్‌బండ్‌లో దూకి చచ్చిపోదామని నిర్ణయించుకుని లేఖ రాసింది. తమ ఊరిలోని మరో బాల్య స్నేహితుడికి వీడియోకాల్ చేసి చనిపోతున్నానని కూడా చెప్పింది.